ఆయన ఆలోచనంతా ఇద్దరు రమేశ్‌ల గురించే : చంద్రబాబుపై సజ్జల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 26, 2020, 3:40 PM IST
Highlights

ప్రజలు తీర్పు ఇచ్చి 14 నెలలు కావొస్తున్నా చంద్రబాబులో ఏమాత్రం మార్పు లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 

ప్రజలు తీర్పు ఇచ్చి 14 నెలలు కావొస్తున్నా చంద్రబాబులో ఏమాత్రం మార్పు లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధ్వంసానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమి విధ్వంసం జరిగిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. దేశానికే ఆదర్శవంతమైన పథకాలు పెట్టడం విధ్వంసమా..?, అవినీతి రహిత పాలన అందించడం విధ్వంసమా..? అని రామకృష్ణారెడ్డి నిలదీశారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అవినీతికి పాల్పడ్డారని సజ్జల ధ్వజమెత్తారు. 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దోచుకున్నారని... తన హయాంలో జరిగిన విధ్వంసం జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగలేదని చంద్రబాబు బాధపడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.

కరోనా సమయంలో చంద్రబాబు ఎక్కడ ఉన్నారని సజ్జల నిలదీశారు. నీకు ఏమైనా రోగాలు ఉన్నాయనుకుంటే మీ కుమారుడు ఏమయ్యాడని ఆయన ప్రశ్నించారు.

ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని... యజ్ఞానానికి రాక్షసులు అడ్డం పడ్డట్టు జగన్ చేసే మంచి పనులకు చంద్రబాబు అడ్డు పడుతున్నారని సజ్జల సెటైర్లు వేశారు.

హైదరాబాద్ లో కూర్చొని జూమ్ మీటింగ్ లతో చంద్రబాబు కాలం గడుపుతున్నారని.. కోర్టులను వేదికలుగా చేసుకొని అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా కరోనాకు చర్యలు తీసుకుంటున్నామని... శవాల మీద పేలాలు ఎరుకున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ వంటి ప్రతిపక్షం దేశంలో ఎ రాష్ట్రంలో లేదన్న ఆయన... తన బినామిలను రక్షించుకొనేందుకు అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. వేల కోట్లు కొల్ల గొట్టే అవకాశం కొల్పవడంతో చంద్రబాబు అమరావతిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అమరావతిలో 11 వేల మంది రైతులు ఉన్నారని, వారికి ఎలా న్యాయం చేయాలని సీఎం ఆలోచన చేస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు కాబట్టే లోకేష్ ను మంగళగిరిలో ఓడించారని సజ్జల ధ్వజమెత్తారు.

ఇద్దరు రమేష్ ల గురించి తప్ప చంద్రబాబు ఏమి ఆలోచన చేయడం లేదని.. సొంత కులానికి కూడా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక కులానికే పరిమితమయ్యారని... కానీ జగన్ కులాలు, మతాలకు, రాజకీయాలకు అతీతుడని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

బాబు ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి పాలనపైనే దృష్టి పెట్టారని సజ్జల వెల్లడించారు. జగన్ పబ్లిసిటీ కోరుకోరని.. కరోనా భయంతో చంద్రబాబు హైదరాబాద్ వదిలి రావడం లేదని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

click me!