వరుసగా ఐదు రోజులు, ఐదు శాఖలు... ఏడాది పాలనపై సిఎం జగన్ మేధో మదనం

By Arun Kumar PFirst Published May 20, 2020, 8:12 PM IST
Highlights

వైసిపి ఏడాది పాలనపై మేదోమదనం పేరిటి సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ఏపి సర్కార్ సిద్దమైంది. ఐదురోజుల పాటు వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. 

అమరావతి: అధికారాన్ని చేపట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఇంతకాలం సాగించిన పాలనపై వరుస సమీక్షలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.   ఈ నెల 25 నుంచి ఐదు రోజుల పాటు జగన్ వరుస సమీక్షలు చేపట్టనున్నారు. మేధోమధన సదస్సుల పేరుతో ఈ సమీక్షలు నిర్వహించనున్నట్లు ఏపి ప్రభుత్వం వెల్లడించింది. 

ఇందులో భాగంగా తొలిరోజు వ్యవసాయంపై, రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు వైద్య ఆరోగ్య శాఖపై, నాలుగోరోజు వాలంటర్ వ్యవస్థ, ఐదో రోజు ప్రణాళిక విభాగంపై సంబంధిత అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇలా ఐదు రోజుల పాటు ఐదు శాఖల పనితీరుపై ఆయన పూర్తిగా సమీక్షించనున్నారు.

విద్యాశాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ శాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. తన ఛాంబర్ లో రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులతో బుధవారం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశాలపై విద్యాశాఖ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. 

ఏడాది ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన చర్చించారు. సంవత్సర కాలం పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్నన పొందిన నేపథ్యంలో ఏయే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏవిధంగా తోడ్పాటు అందించాయన్న అంశంపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులతో చర్చించామన్నారు. ఈ కార్యక్రమాలను రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై మేధోమదనంలో ఐదురోజుల పాటు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారని తెలిపారు. 

సిఎంతో జరిగే  మేధో మదన సమీక్షను విజయవంతం చేసేందుకు విద్యాశాఖకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనపై ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు ఏమేరకు ప్రజలకు చేరువయ్యాయి అనే అంశంపై ప్రభుత్వం సమీక్ష చేపడుతున్నట్లు మంత్రి అధికారులకు వివరించారు. కార్యక్రమం ప్రాంరభం నుంచి ముగింపు వరకు తీసుకోవాల్సిన అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. 

read more  తెలంగాణ ప్రభుత్వంతో కలిసే పనిచేస్తాం: పోతిరెడ్డిపాడుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

మేధో మదనం కార్యక్రమం మొత్తం 5 రోజులు జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణపై సీనియర్ అధికారితో ఛైర్మన్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రతిరోజు మేధో మదన సమీక్షలు  ఛైర్మన్, కమిటీ సభ్యుల పర్యవేక్షణలోనే జరుగుతాయని తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తో జరిగిన సమీక్షలో ప్రధానంగా ఎవరెవరూ కార్యక్రమంలో పాల్గొనాలి, అతిథులకు సమీక్షలో అవకాశం కల్పిస్తే బాగుంటుందని మంత్రి ముందు అధికారులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరితగతిన కార్యక్రమ షెడ్యూల్ ను రూపొందించాలని సూచించారు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీచేశారు. వైయస్ఆర్ నవరత్నాలలోని విద్యా నవరత్నాలుగా అమలు చేస్తున్న 1. అమ్మఒడి 2. మౌలిక సదుపాయాల రూపకల్పన 3. విద్యాప్రమాణాలు పెంపు 4. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లవిద్య 5. మాతృభాషా వికాసం 6. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, పాదరక్షలు  7. నైపుణ్యాభివృద్ధి 8.ప్రైవేటు విద్యాసంస్థలపై రెగ్యులేటరీ కమిషన్ 9.  పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలను మంత్రి సమావేశంలో ప్రస్తావించారు. 

read more  ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు... హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు...

ఎక్కడా రాజీ లేకుండా విద్యాశాఖ పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలియజేయనున్నామని తెలిపారు. మంత్రితో జరిగిన సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిన్న వీరభద్రుడు, కళాశాల సాంకేతిక విద్య, రూసా ఎస్పిడి అధికారి నాయక్, ఆంగ్లవిద్య ప్రత్యేక అధికారి వెట్రి సెల్వి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ రామ చంద్రారెడ్డి తదతరులు పాల్గొన్నారు. 

click me!