టార్గెట్ బాలకృష్ణ.. హిందూపురంపై ఫోకస్ పెట్టిన పెద్దిరెడ్డి

By SumaBala BukkaFirst Published Jan 8, 2024, 4:17 PM IST
Highlights

వరుసగా గెలిపిస్తుంటే.. హిందూపురానికి ఆ పార్టీ ఏం చేసిందంటూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే  బాలకృష్ణకు, టీడీపీకి చురకలంటించారు మంత్రి పెద్దిరెడ్డి. 

హిందూపురం : వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వరుసగా ఆరు రోజులపాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే బిసి మహిళలను హిందూపూర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారని అన్నారు. బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. హిందూపూర్ ప్రజలు ఎన్నిసార్లు ఒకే పార్టీకి ఓటు వేసి గెలిపించినా.. ఏం అభివృద్ధి చేశారంటూ ప్రశ్నించారు. దీంతో హిందూపూర్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి పెద్దిరెడ్డిల మధ్య  రాజకీయ రచ్చ మొదలైంది. హిందూపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో వరుసగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది.

Latest Videos

వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు.. మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు.. టికెట్ దక్కదనేనా..?

వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి కాదని చేతుల మనిషి అని..   ఆయన ప్రతిసారి నా ఎస్టీ,  నా ఎస్సీ, నా బిసి, నా మైనారిటీలు అని చెప్పడమే కాదు చేసి చూపిస్తారని పెద్దిరెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చి ఓట్లు ఆశించారని,  2014లో చంద్రబాబు రైతు మహిళల రుణమాఫీలు అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ రూ. 3000 చేసిన ఘనత వైయస్ జగన్ దే అన్నారు. 

జగన్ చంద్రబాబులా కాదని ఎన్నికల ముందు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారని చెప్పుకొచ్చారు. దీనికి నిదర్శనంగానే ఎన్నికల ముందు చెప్పిన పెన్షన్ ని మూడువేల వరకు చేశారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అకౌంట్లో వేయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అని చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తారని ఎద్దేవా చేశారు.

తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా చెప్పింది చెప్పినట్టుగా హామీలు అమలు చేసే నేతను చూడలేదనిపెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. కరోనా సమయంలో చంద్రబాబు,  హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ లు హైదరాబాదులో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు కరోనాలో అండా దండగా ఉందని చెప్పుకొచ్చారు.

బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని.. ఏకకాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైయస్ జగన్ అని పెద్దిరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే జగన్ ను ఆదరించాలని..  ఈ ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసేలా ప్రజలు ఆలోచించాలని సూచించారు.

click me!