విజయవాడ ఎంపీగానే కేశినేని నాని పోటీ... వెనక్కి తగ్గేదేలే..: కేశినేని శ్వేత

By Arun Kumar PFirst Published Jan 8, 2024, 2:58 PM IST
Highlights

ఇవాళ ఉదయం విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత రాజీనామ లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి నాాని రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

విజయవాడ : మరో రెండుమూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో అన్ని ప్రధాన పార్టీలను నాయకుల రాజీనామాలు కలవర పెడుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పోరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేసారు. తన తండ్రి, విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి మళ్లీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో టిడిపిని వీడేందుకు శ్వేత సిద్దమయ్యారు. ఈ క్రమంలో మొదట టిడిపి నుండి గెలిచిన కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు శ్వేత తెలిపారు. 

ఇవాళ ఉదయం విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత రాజీనామ లేఖ సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే కార్పోరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని... వెంటనే ఆమోదించాలని మేయర్ ను కోరారు. తన రాజీనామా అనంతరం శ్వేత మాట్లాడుతూ... తన తండ్రి పట్ల టిడిపి నాయకత్వం చాలా అవమానకరంగా వ్యవహరించిందని అన్నారు. కేశినేని చిన్నితో విబేధాలు గురించిగానీ... విజయవాడ ఎంపీ టికెట్ విషయం గురించిగానీ తమను పిలిచి మాట్లాడివుంటే బావుండేదని అన్నారు. కానీ తమను సంప్రదించకుండానే టిడిపి పెద్దలు నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని శ్వేత ఆవేదన వ్యక్తం చేసారు. 

Latest Videos

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరొకరికి అవకాశం ఇస్తాం... మీరు తప్పుకోవాలని తన తండ్రి కేశినేని నానిని కోరివుంటే బావుండేదని శ్వేత అన్నారు. అలాకాకుండా అభ్యర్ధిని మార్చాలని నిర్ణయం తీసుకుని చివర్లో తమకు తెలియజేసారని అన్నారు. అయితే కేశినేని నాని విజయవాడ ఎంపీగానే పోటీచేయడం ఖాయం... అది ఇండిపెండెంట్ గానా లేక ఏదయినా పార్టీ నుండా అన్నది త్వరలోనే తేలనుందని శ్వేత స్పష్టం చేసారు. 

ఎంపీ పదవికి, టిడిపి సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా చేస్తారని... రాజకీయ భవిష్యత్ పై సన్నిహితులు, అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఏ పార్టీలో చేరతారనేది ఇప్పటికయితే నిర్ణయించలేదు... కానీ అన్ని పార్టీల నాయకులతో తన తండ్రికి మంచి సంబంధాలు వున్నాయన్నారు. ఏ పార్టీలో చేరినా ఆయన విజయవాడ ఎంపీగానే పోటీచేస్తారని శ్వేత తెలిపారు. 

టిడిపికి రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, రసరావుపేట లోక్ సభ  నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని శ్వేత అన్నారు. ఆ నియోజవర్గాల్లో పార్టీని పటిష్టం చేసి అభ్యర్థిని రెడీ చేయాల్సింది పోయి విజయవాడపై పడ్డారని అన్నారు. అసలు కేశినేని నానిని కాదని కేశినేని చిన్నికి టిడిపి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థంకావడం లేదని అన్నారు. కేశినేని చిన్ని గురించి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోలేనని శ్వేత అన్నారు. 

 

click me!