
వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకునే దిశగా వైసీపీ ఇప్పటి నుండి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతోందా? సోమవారం పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే పక్కా స్కెచ్ తోనే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్లే కనిపిస్తోంది. కాకపోతే అంతకన్నా ముందే తమ పార్టీకి రాబోయే ఓట్లెన్ని అన్న విషయాన్ని ఖచ్చితంగా భేరీజు వేసుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోన్నది అర్ధమైపోతోంది.
సమావేశం తర్వాత అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పిన వివరాలు చూస్తుంటే జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ జట్టు ఏస్ధాయిలో కష్టపడుతోందో అర్ధమవుతుంది. మొన్నటి ప్లీనరీలో జగన్ ప్రెకటించిన ‘నవరత్నాలు’ పథకాల పట్ల ప్రజలు ఏ మేరకు సానుకూలంగా ఉన్నారో కూడా తెలుసుకునేందుకు ప్లాన్ వేసారు. వైఎస్ఆర్ కుటుంబమని, విజయశంఖారావమనే కార్యక్రమాలను రూపొందించారు. అంటే 60 రోజుల కార్యక్రమాలను రూపొందించి పార్టీ శ్రేణులను మొత్తాన్ని జనాల్లోనే ఉండేట్లుగా పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
ఇంటంటికి వైఎస్సాఆర్ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ప్రతీ ఇంటికీ వెళ్లి సభ్యులను కలిసి పార్టీలో చేరాల్సిందిగా కోరుతారు. చేరదలచుకున్న వాళ్లకి సభ్యత్వాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతుంది. అంటే వచ్చే ఎన్నికలకు ముందే వైసీపీలో ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారన్న విషయమై పార్టీకి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాని వల్ల ఎన్నికల్లో రాబోయే ఓట్లపై ఓ అంచనాకు రావచ్చన్నది బహుశా పార్టీ నాయకత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
వైసీపీ వ్యూహం చూస్తుంటే 2019 ఎన్నికలైన తర్వాత తమకు వచ్చిన ఓట్లను లెక్కేసేకంటే, ఎన్నికలకు ముందే వైసీపీ రాబోయే ఓట్లపై ముందస్తు అంచనా వేసుకునేందుకే ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అందుకు ప్రశాంత్ కిషోర్ బృందం యధాశక్తి ప్రతీ నియోజకవర్గంలోనూ సహకారం అందిస్తుంది. సెప్టెంబర్ 2వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమాలు అక్టోబర్ 25వరకూ జరుగుతుంది. అంటే అక్టోబర్ 26 లేదా 27న జగన్ పాదయాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే కదా? పాదయాత్ర మొదలయ్యే నాటికే రాష్ట్రంలో వైసీపీ పరిస్ధితిపై జగన్ కు ఓ స్పష్టమైన లెక్కుంటుందన్నమాట.