
చంద్రబాబునాయుడు ప్రభుత్వ విధానాల వల్లే జనాలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారా? సిఎంకు జగన్ రాసిన లేఖలో ఆ విధంగానే పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి, పోయిన ఎన్నికల్లో చేసిన హామీలు తదితరాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసారు. దానిప్రకారం రాష్ట్ర విభజన జరిగేనాటికి రాష్ట్రంలో 1,42,828 ఖాళీలున్నాయ్. ఖాళీల భర్తీపై ప్రభుత్వ విధానమేమిటంటూ నిలదీసారు.
గత ఏడాది 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగినా ఇంకా 17 వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వటం లేదని ప్రశ్నించారు. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కటం వల్లే నిరుద్యోగిత పెరిగిపోతుందని జగన్ ఆరోపించారు. ఇటు ఉద్యోగాల భర్తీ చేయక అటు ఇచ్చిన నిరుద్యోగ భృతినీ ఇవ్వకపోవటంతో నిరుద్యోగులు అల్లాడిపోతున్నట్లు వివరించారు.
ఎన్నికల హామీ మేరకు ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 1.75 కోట్ల ఇళ్ళకు నిరుద్యోగ భృతి సుమారు 1. 22 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాలంటూ పేర్కొన్నారు. ఏదో రాజకీయంగా చంద్రబాబును ఇరుకున పెట్టటానికి నిరుద్యోగ భృతి అంశం పనికివస్తుందే కానీ నిజంగా చంద్రబాబునాయుడుడ ఏనాడో చేతులెత్తేసిన సంగతి అందరికీ తెలిసిందే. పనిలో పనిగా గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిరుద్యోగుల కోసం మ్యనిఫెస్టోలో చేసిన హామీలను కూడా వివరించారు.
అధికారంలోకి రాగానే 6 వేలమంది ఆదర్శరైతులను, 1500 మంది గృహనిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్లను, గ్రామీణాభివృద్ధి శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 2016 మందిని, ఉపాధిహామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 4 వేలమందిని, ఆయుష్ లోని 800 మందిని తొలగించిన విషయాన్ని గుర్తిచేసారు. నిరుద్యోగుల్లో పెరిగిపోతున్న అసంతృప్తి ఏ సమాజానికి మంచిదికాదన్నారు. ఉద్యోగాల భర్తీకాక, నిరుద్యోగం పెరిగిపోతున్న కారణంగా, ఉపాధిలేక రాష్ట్రంలోని యువత ఇతర ప్రాంతాలకు వలసవెళుతున్నట్లు జగన్ ఆరోపించారు. తాను ప్రస్తావించిన అంశాలన్నీ పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అన్న విషయాన్ని చంద్రబాబునాయుడుకు జగన్ గుర్తు చేయటం విశేషం.