
ఆశ ఉండటంలో తప్పులేదు. కానీ అత్యాశ పనికిరాదు. కృష్ణా జిల్లాలో ఈరోజు జరుగుతున్న మినీ మహానాడులో సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడిన విషయంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. యనమల మాట్లాడుతూ ‘రాష్ట్రంలో మరే పార్టీని ఎదగనీయకుండా చేయాలి’. ‘తెలుగుదేశమే వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలి’ అని స్పష్టంగా చెప్పారు.
టిడిపినే వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే, అధికారంలో ఉన్న ప్రతీ పార్టీ కోరుకునేదదే కాబట్టి. కానీ రాష్ట్రంలో మరే పార్టీనీ ఎదగనీయకుండా చేయాలి అనేది మాత్రం విచిత్రంగానే ఉంది. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ప్రజాధరణ చూరుగొని అధికారంలోకి రావచ్చు.
1982లో సినీనటుడు ఎన్టీఆర్ చేసిందదే కదా? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకపోతే అసలు తెలుగుదేశం పార్టీయే లేదన్నది వాస్తవం. ఈమధ్య ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీ వాల్ కూడా ప్రజాధరణతోనే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సంగతి యనమలకు తెలీదా? రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎదగకుండా చూడాలనటంలో యనలమ ఉద్దేశ్యమేమిటి? యనమలకు ప్రజాస్వామ్యంపైన కన్నా డిక్టేటర్షిప్ పైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్లు కనబడతుతోంది.
గడచిన మూడేళ్ళల్లో చంద్రబాబునాయుడు పాలనసై జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటంపై యనమలకు అనుమానం వచ్చినట్లంది. అందుకనే మరే పార్టీని ఎదగనీయకుండా చేయాలంటున్నారు. అయినా అధికారంలో ఎవరు ఉండాలో తేల్చాల్సింది ప్రజలు. యనమల కాదు చంద్రబాబూ కాదు. ఇంతకీ ‘మరే పార్టీ’ అనటంలో యనమల ఉద్దేశ్యం భాజపాను కూడా కలిపేనా?