దేవినేని ఉమ హత్యకు కుట్ర... అందులో భాగమే దాడి: మాజీ మంత్రి యనమల సంచలనం

By Arun Kumar PFirst Published Jul 28, 2021, 11:20 AM IST
Highlights

సహజ వనరుల దోపిడిని అడ్డుకుంటే హత్యాయత్నానికి పాల్పడుతారా? అని వైసిపి నాయకులను ప్రశ్నించారు మాజీ ఆర్థిక మంత్రి యనమల. మాజీ మంత్రి దేవినేని ఉమపై జరిగిన దాడిపై స్పందిస్తూ యనమల సీరియస్ అయ్యారు. 

గుంటూరు: వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం కవల పిల్లలుగా మారి రాజ్యమేలుతున్నాయని మాజీ మంత్రి, టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టంలో వైసీపీ నేతల సహజవనరుల దోపిడికీ, అవినీతికి అదుపులేకుండాపోతోందన్నారు. కృష్ణా జిల్లా  మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం పారెస్ట్ లో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ ని వెలికితీసేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కారుపై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు యనమల.

''మైలవరం నియోజకవర్గంలో స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రష్ణప్రసాద్ కనుసన్నల్లోనే వేల కోట్ల గ్రావెల్ ను వైసీపీ నేతలు దోచుకుతింటున్నారు. సహజ వనరులను దోపిడిని అడ్డుకుంటే హత్యాయత్నానికి పాల్పడుతారా?  దాడిచేసిన నిందుతులను వదిలేసి దాడిలో బాధితులైన దేవినేని ఉమాను అరెస్ట్ చేయటం అప్రజాస్వామికం. ఇది చట్టాన్ని ఉల్లంఘించటమే. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు గూండాలకు వత్తాసు పలకటం ఏంటి?'' అని యనమల నిలదీశారు. 

read more  మాజీ మంత్రి ఉమపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు

''పోలీస్ వ్యవస్ధ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి కన్పిస్తోంది.  ఉమామహేశ్వర రావుపై దాడికి పాల్పడిన వైసీపీ గూండాలను వదలిలేసి కృష్ణా జిల్లా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయటం ఏంటి? దేవినేనిని పోలీసులు వెంటనే వదలిపెట్టి, నిందితులను అరెస్ట్ చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''మీ దాడులు, అరెస్టులకు టీడీపీ నాయకులు కాదు కదా కార్యకర్తలు కూడా భయపడరు.  వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతిపై ప్రజలే తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది.  మీరు ఎన్ని అరెస్ట్ లు చేసినా వైసీపీ నేతల సహజవరులపై దోపిడిపై టీడీపీ పోరాటం ఆగదు'' అని మాజీ మంత్రి యనమల హెచ్చరించారు. 

click me!