మాకేం సంబంధం: చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటి సోదాలపై యనమల

By telugu team  |  First Published Feb 14, 2020, 12:23 PM IST

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంపై ఐటి సోదాలు జరిగిన నేపథ్యంలో వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తిప్పికొట్టారు. మాజీ పీఎస్ మీద దాడులు జరిగితే చంద్రబాబుకేం సంబంధమని ఆయన అడిగారు.


హైదరాబాద్: పిఏలు, పిఎస్ లతో పార్టీకి సంబంధం ఏం ఉంటుందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 
పిఎస్ శ్రీనివాస్ కు టిడిపితో ఏం సంబంధం ఉంటుందని ఆయన అడిగారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పిఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ రావు నివాసంలో ఐటి సోదాలు జరిగిన నేపథ్యంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ ఆయన శుక్రవారం ఆ ప్రశ్నలు వేశారు.

శ్రీనివాస్ ఒక ప్రభుత్వ అధికారి మాత్రమేనని ఆయనపై దాడులు అతని వ్యక్తిగతమని యనమల అన్నారు. వాటిని టిడిపికి ముడిపెట్టడం కావాలని బురద జల్లడమేనని అన్నారు. 
40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10-15మంది పిఎస్ లు, పిఏలు పని చేశారని, మాజీ పిఎస్ పై దాడులు జరిగితే పార్టీకి అంటగట్టడం హేయమని అన్నారు. 

Latest Videos

undefined

Also Read: ఐటి శాఖ ప్రకటన: చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు

దేశవ్యాప్తంగా 40చోట్ల దాడులకు టిడిపికి సంబంధం ఏమిటని ఆయన అడిగారు. అక్రమాస్తుల కేసుల నుంచి ‘‘తాను తప్పించుకోవడం.. ఎదుటివాళ్లపై దాడులు చేయడమే’’ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారని అన్నారు. టిడిపిపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా చేసింది కూడా టిడిపిపై ఫిర్యాదుల కోసమేనని అన్నారు. 

జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయి రెడ్డేనని ఆయన ఆరోపించారు. వాటిని కప్పిపుచ్చుకోడానికే ఢిల్లీ స్థాయి పదవులు ఇచ్చారని, తన తరఫున పైరవీలకు, టిడిపిపై ఫిర్యాదులకే ఢిల్లీలో విజయసాయి రెడ్డిని పెట్టారని ఆయన విమర్శించారు. 

జగన్ రూ 43వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుది దశకు చేరిందని, రూ 4వేల కోట్ల జగన్ ఆస్తులను ఈడి జప్తు చేసిందని,  ట్రయల్స్ కు హాజరు కాకుండా జగన్ అందుకే ఎగ్గొడుతున్నారని ఆయన అన్నారు. శిక్ష తప్పదని తెలిసే ట్రయల్స్ ను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. 

Also Read: ఓ ప్రముఖ వ్యక్తి పీఎస్ వద్ద కీలక సాక్ష్యాలు: తెలుగు రాష్ట్రాల్లో దాడులపై ఐటి శాఖ

ఎనిమిదేళ్లుగా సిబిఐ, ఈడి ఎంక్వైరీకి అడ్డంకులు పెడుతున్నారని, కోర్టుకు హాజరు కాకుండా పదేపదే మినహాయింపులు కోరేది అందుకేనని యనమల అన్నారు. 
హైకోర్టులో సిబిఐ పిటిషన్ కు జగన్ ముందు జవాబు ఇవ్వాలని ఆయన అన్నారు. ఎక్కడో ఎవరో మాజీ పిఎస్ పై రెయిడ్స్ కు టిడిపికి అంటగట్టడం ఏమిటని ఆయన అడిగారు. రివర్స్ టెండర్ కాంట్రాక్ట్ మీరిచ్చిన ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి, టిడిపికి సంబంధం ఏమిటని,  తెలంగాణలో ఇన్  ఫ్రా కంపెనీపై దాడికి టిడిపికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

రెయిడ్స్ జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే కాంట్రాక్ట్ లు మీరివ్వలేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. 16నెలలు జైలు, 16ఛార్జిషీట్లు ఉన్న మీకా నైతిక హక్కు ఎక్కడిదని ఆయన జగన్ ను అడిగారు. "మీ రూ 43వేల కోట్ల అవినీతి సంగతి తేల్చు ముందు..? మీ మీద ఆరోపణలు ముందు నిగ్గు తేల్చుకోండి.. ఏడాదిలో విచారణ పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెప్పింది.  మీరెందుకు 8ఏళ్లుగా అడ్డుకుంటున్నారు..? వాయిదాలకు మినహాయింపులు ఎందుకు అడుగుతున్నారు. పదేపదే పిటిషన్లు ఎందుకు పెడుతున్నారు..?" ఆయన అడిగారు. 

8ఏళ్లుగా కేసులు తప్పించుకుని తిరిగేవాళ్లు టిడిపిని విమర్శించడం దారుణమని ఆయన అన్నారు. టిడిపి, వైసిపి ఏది ఎలాంటి పార్టీయో ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. 
టిడిపి నిప్పులాంటి పార్టీ, నీతి నిజాయితీలున్న పార్టీ అని అన్నారు. 

తప్పుడు పనులు చేసే పార్టీ టిడిపి కాదని అన్నారు. సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ టిడిపి అని అన్నారు. అందుకే 40ఏళ్లుగా ప్రజల గుండెల్లో ఉందని, 
తప్పుడు పనుల్లో నుంచి పుట్టిన పార్టీ వైసిపి అని ఆయన అన్నారు. 

అక్రమార్జన కాపాడుకోడానికి పెట్టిన పార్టీ వైసిపిఎన్నికల సంస్కరణలు రావాలి, పొలిటికల్ రిఫామ్స్ రావాలి అన్న పార్టీ టిడిపి అని ఆయన అన్నారు. రూ 500, రూ 1,000 నోట్లు రద్దు చేయాలని కోరిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. గత ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీలో వైసిపి రూ 30కోట్లు ఖర్చు పెట్టిందని వాళ్ల నేతలే చెప్పారని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉండి కూడా టిడిపి డబ్బులకు ఇబ్బందులు పడిందని అన్నారు.

చంద్రబాబుపై గతంలోనే 26ఎంక్వైరీలు వేశారని ఆయన చెప్పారు. సభా సంఘాలు, న్యాయ విచారణలు, సిబిసిఐడి అన్నీ చేశారని, ఎందులోనూ వాళ్ల ఆరోపణలు రుజువు చేయలేక పోయారని యనమల చెప్పారు. ఏనాడన్నా జగన్ అవినీతిపై సాక్షి పత్రిక రాసిందా..? సాక్షి ఛానల్ ప్రసారం చేసిందా.. అని అడిగారు. సిబిఐ, ఈడి కౌంటర్ పిటిషన్ల గురించి చెప్పిందా.. అని ప్రశ్నించారు. 

చంద్రబాబు మాజీ పిఎస్ పై దాడులకు ఇచ్చిన ప్రాధాన్యం, జగన్ ఆస్తుల ఈడి జప్తుపై ఇచ్చిందా.., జగన్ 43వేల కోట్ల అవినీతిపై సిబిఐ అఫిడవిట్ పై సాక్షి రాసిందా.. అని అన్నారు. అదే సాక్షికి, ఇతర మీడియాకు ఉన్న వ్యత్యాసమని అన్నారు. టిడిపిపై సాక్షి మీడియా, వైసిపి నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తున్నామని, దీనిని మానుకోకపోతే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని యనమల అన్నారు.

click me!