
లోకేశ్ ను చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. క్యాబినెట్లో చేరాతానంటే ఆడిపోసుకున్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో నిలబడితే మొగం చిట్లించుకున్నారు. స్టాన్ ఫోర్డ్ బాలమేధావి అని ఎగతాళిచేశారు. పప్పు అంటున్నారు, ఉప్పు అంటున్నారు. అసెంబ్లీకి పోటీచేసేందుకు భయపడే, కౌన్సిల్ లో, అందునా సురక్షితమయిన అసెంబ్లీ రూటులో కౌన్సిల్ లోకి దూరి ఎమ్మెల్సీ అవుతున్నాడని అన్నారు. చివరకు ఏకగ్రీవంగా గెలవడం కూడా వారికి నచ్చలేదు. అయితే, ఎందుకు కౌన్సిల్ కు నిలబడాల్సి వచ్చిందో చినబాబు లోకేశ్ చాలా వివరంగా చెప్పారు. అయినా వారితలకెక్కలేదు.
‘ నేను అసెంబ్లీ కి పోటీచేసేందుకు ఎవ్వరినో ఎందుకు బలవంతంగా రాజీనామా చేయించాలి. అది నాకిష్టం లేదు అట్లాంటి పద్ధతిలో వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని నేను అనుకోవడం లేదు. నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నది అందుకే. అది పార్టీ నిర్ణయం. నా పార్టీ సర్పంచ్ గా పోటీ చేయమంటే కళ్లకు అద్దుకుని పోటీ చేస్తా,’ అని ఆయన చాలా స్పష్టంగా, హుందాగా చెప్పారు. అయితే, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంతకంటే బలంగా తగిన సమాధానం చెప్పాలి. చెప్పేందుకు లోకేశ్ పూనుకోవాలి. తానేమిటో నిరూపించుకోవాలి. మామ బాలయ్య చెప్పినట్లు శరణమా.. రణమా...తేల్చాలి.
దీనికి నంద్యాల చక్కని అవకాశం కల్పిస్తూ ఉంది. ఎవ్వరూ ఎవరికోసం రాజీనామాచేయాల్సిన అవసరం లేదు. పార్టీకోసం అహర్నిశలు పరితపించి పనిచేసిన భూమానాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఆరు నెలల లోపు ఈనియోజకవర్గానికి ఉప ఎన్నికల జరగాలి. అక్కడ ఎవ్వరినో పోటీ పెట్టి గెలిపించడం కంటే, లోకేశే పోటీ చేసిగెల్చిన ప్రతిపక్షం నోరు, వారి మద్దతు దార్ల నోరు మూయించేందుకు పూనుకోవాలి. కౌన్సిల్ కు రాజీనామా చేయవచ్చు. చేయకుండా కూడా పోటీ చేయవచ్చు. గెలిస్తే కౌన్సిల్ సీటును వదులుకుని నంద్యాల ఎన్నికల్లో బాగా పనిచేసిన మరొకరిని(భూమా కుటుంబం నుంచే అనుకోండి) కౌన్సిల్ కు తీసుకురావచ్చు. నంద్యాల లో ఓడిపోతే, మన కౌన్సిల్ సీటు మనకుంటుంది. ఓడేదేముండదని కౌన్సిల్ ఎన్నికలు చెబుతున్నాయి. గెలుపే తథ్యం, లోకేశ్ ముందుకురావాలి. నంద్యాల నుంచ పోటీచేయాలి,ప్రతిపక్షంనోరుమూయించాలి.
అన్నింటికంటే ముఖ్యంగా, ఎక్కడయిన ఖాళీ ఉంటే పోటీచేసి ఉండేవాడిని అని కూడా ఆయన అన్నారు. అలా అంటూనే... ఇలా ఖాళీ ఏర్పడింది. వెనకంజవేయరాదు, రాయలసీమ ఆయన వెనక ఉందని నిరూపించుకోవాలి. ఇపుడు కౌన్సిల్ ఎన్నికలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. సంశయించి చెడ్డపేరు తెచ్చుకోరాదు. లెట్స్ డూ కుమ్ముడూ...