విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ: ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు.. 14న యాజమాన్యానికి సమ్మె నోటీసు

By Siva KodatiFirst Published Jun 9, 2021, 9:40 PM IST
Highlights

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని కార్మిక సంఘాలు మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ నెల 14న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు తీర్మానం చేశాయి.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని కార్మిక సంఘాలు మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ నెల 14న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు తీర్మానం చేశాయి. ఈ మేరకు ఈ నెల 30 నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీనితో పాటు ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశాయి. 

అంతకుముందు మే నెల ప్రారంభంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇచ్చిన సమ్మె పిలుపును కార్మిక సంఘాలు వెనక్క తీసుకున్నాయి. దేశంలోని కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా సమ్మె వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో కార్మిక నేతలు తెలిపారు. దేశంలోని కోవిడ్ ఆసుపత్రులకు విశాఖ ఉక్కు నుంచి భారీగా ఆక్సిజన్ సరఫరా అవుతున్న సంగతి తెలిసిందే. 

Also Read:ఊపిరిపోస్తున్న విశాఖ ఉక్కు... ప్రైవేటీకరణ సబబేనా: చిరంజీవి సంచలన ట్వీట్

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొద్దినెలలుగా కార్మికులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. కరోనా వల్ల ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించిన కార్మిక సంఘాలు మరోసారి యాక్టివ్ అవుతున్నాయి. 

click me!