మీరు ఒక్క మంచి పనైనా చేసారా...?: వైసిపి ఎమ్మెల్యేను రోడ్డుపై పట్టుకుని నిలదీసిన మహిళ

Arun Kumar P   | Asianet News
Published : May 17, 2022, 01:43 PM ISTUpdated : May 17, 2022, 01:56 PM IST
మీరు ఒక్క మంచి పనైనా చేసారా...?: వైసిపి ఎమ్మెల్యేను రోడ్డుపై పట్టుకుని నిలదీసిన మహిళ

సారాంశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నమంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. 

తిరువూరు: అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం వున్నా ఇప్పటినుండే ప్రజలతో మమేకం అయ్యేందుకు వైసిపి ప్రణాళికలు రచించింది. వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు సీఎం జగన్ ఇప్పటికే జిల్లాల పర్యటన చేపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరిట ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేసారు. సీఎం జగన్ ఆదేశాలతో ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న కొందరు వైసిపి ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. 

తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు వైసిపి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి సొంత నియోజకవర్గంలో చుక్కెదురయ్యింది.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ (మంగళవారం)  ఎ.కొండూరు మండలం కోడూరులో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. 

Video

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మంచి పనైనా చేసారా? అంటూ ఎమ్మెల్యే రక్షణనిధిని నడిరోడ్డుపై అందరిముందే ఓ మహిళ నిలదీసింది. గూడు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టివ్వకుండా, మౌళిక సదుపాయాల్లో అతి ముఖ్యమైన రహదారులను బాగుచేయలేదని, దీంతో రోడ్లన్ని అధ్వానంగా మారాయని మహిళ తెలిపింది. ఇక జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉందంటూ సదరు మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది.  

అడ్డమైన పథకాలు పెట్టారు... ఒక్క మంచి పనైనా చేసారా అంటూ ఎమ్మెల్యే ముందే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా పలు సమస్యలను ఎమ్మెల్యే వద్ద ఏకరవు పెట్టింది సదరు మహిళ. అయితే ఇవన్నీ నీకేందుకు... నీ వ్యక్తిగత సమస్య ఏమయనా వుంటే అడగాలని వైసిపి నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేసారు. ఇలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధికి చేదు అనుభవం ఎదురయ్యింది.

ఇక ఇలాంటి అనుభవమే మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎదురయ్యింది. ఇటీవల కర్నూలు జిల్లా అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను  స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే... అద్వాన్నంగా మారిన రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు...  ఆ డబ్బులు ఇవ్వకపోయినా సరే తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. 

ఇదిలావుంటే 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టిన వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కూడా చేదు అనుభవం ఎదురయ్యింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవకర్గంలోని బీఎన్ కండ్రిగ మండలం కనమనంబేడు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ క్రమంలోనే తమ గ్రామ సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యేను నిలదీసారు. రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలంటూ ఎమ్మెల్యే ఆదిమూలంను గ్రామస్థులు అడ్డుకున్నారు. 

 ఇక ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే జె సుధాకర్ కూడా ప్రజలనుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. కర్నూలు జిల్లా గూడూరులో సున్నా వడ్డీ పంపిణీపై సమావేశం  ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, మహిళల అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. అయితే అతడి మాటలను కొందరు మహిళలు అడ్డుకుని... నిత్యావసరాలు, గ్యాస్, కరెంట్ చార్జీలు పెంచి మా డబ్బులు మాకే ఇస్తారా..? అంటూ నిలదీసారు. మహిళలకు రూ. 3 వేలు ఇచ్చి వేలకు వేల పన్నులు వసూలు చేస్తున్నారని.. వాటిని ఎలా కట్టాలని ప్రశ్నించారు. 
 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?