జగన్ ‘‘నేతన్న నేస్తం’’ కార్యక్రమంలో విషాదం.. కిక్కిరిసిన సభా ప్రాంగణం, ఊపిరాడక మహిళ మృతి

By Siva KodatiFirst Published Aug 25, 2022, 8:24 PM IST
Highlights

కృష్ణా జిల్లా పెడనలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న నేతన్న నేస్తం కార్యక్రమానికి జనం భారీగా హాజరవ్వడంతో ఓ మహిళ నలిగిపోయింది. ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఊపిరి ఆడకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 
 

కృష్ణాజిల్లా పెడనలో గురువారం జరిగిన నేతన్ననేస్తం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.  పెడనలో ఏర్పాటు చేసిన నేతన్న నేస్తంకి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం హాజరయ్యారు. అయితే భారీ జన సందోహం మధ్యలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. ఎండ వేడిమితో పాటు జనం మధ్యలో ఊపిరాడక ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని పెడన  మండలం దేవరపల్లికి చెందిన సమ్మెట వెంకట మాణిక్యమ్మగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇకపోతే.. పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..  80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు జమ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పటివరకు నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049.2 కోట్లు వెచ్చించినట్టుగా తెలిపారు. ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని తెలిపారు. అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నట్టుగా చెప్పారు.  

ALso Read:వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల విడుదల: గతంలో ఏ ప్రభుత్వం నేతన్నకు అండగా నిలవలేదన్న సీఎం జగన్

చేనేతలతో పాటు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని విమర్శించారు. వైసీపీ పాలనలో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించామని చెప్పారు. సామాజిక న్యాయ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అని అన్నారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి కోసమే గత ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేశారని, గతంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని విమర్శించారు. ప్రజలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని కొందరు కుట్రదారులు ఉన్నారని మండిపడ్డారు. వాళ్లు తప్పుడు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం నేతన్నకు అండగా నిలవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం అందజేస్తున్నామని చెప్పారు. నేతన్నల కష్టాలను తన పాదయాత్రలో గమనించినట్టుగా చెప్పారు.

click me!