సంక్షేమ పథకాల లబ్ధి పొందిన పేదలు, మహిళలందరూ తమకే ఓటేస్తారని వైసీపీ ధీమాగా ఉంది. అయితే, ఓటర్లు మాత్రం ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చారు.
''ఆడవారి మాటలకు అర్థాలే వేరులే...'' అనే సినీ గేయం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ట్రెండింగే. మహిళల మనసులో మాట తెలుసుకోవడం కష్టమన్నది ఈ పాఠం భావం. కాగా, ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌లో ఆడివారి నాడి కూడా పట్టలేక పోయింది వైసీపీ. అమ్మ ఒడి, ఆసరా లాంటి సంక్షేమ పథకాలందుకున్న మహిళలందరూ తమకే ఓటేస్తారని నిన్నమొన్నటి వరకు వైసీపీలో ఉన్న ధీమాను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పటాపంచెలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలి రౌండ్ నుంచి అత్యధిక స్థానాలు ఎన్‌డీయే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఖాతాల పడటమే ఇందకు నిదర్శనం. ..
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పరాజయం పాలైంది. సంక్షేమానికి పెద్దపీట వేసిన వైసీపీ... భారీ మొత్తంలలో పేదల కోసం ఖర్చు చేసింది. దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని డీబీటీ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన పేదలు, మహిళలందరూ తమకే ఓటేస్తారని వైసీపీ ధీమాగా ఉంది. అయితే, ఓటర్లు మాత్రం ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామమాత్రపు స్థానాల్లోనే గెలిపించి.. అధికారం నుంచి దించేశారు. అయితే, సంక్షేమం ఒక్కదాన్నే నమ్ముకోవడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టేసిందన్న విమర్శలు లేకపోలేదు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్‌డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేయగా... జనసేన 21, భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసింది. కోటీ 69లక్షల 8వేల 684 మంది మహిళలు ఓటేశారు. అనకాపల్లి, రాజంపేట , శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, కడప పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పురుషులకు దీటుగా మహిళలు ఓటుహక్కును వినియోగించుకున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించగా... కూటమి వేవ్‌లో వైసీపీ కొట్టుకుపోయిందని చెప్పవచ్చు.