ఎన్డీఎలోకి జగన్, చిరంజీవికి రాజ్యసభ సీటు: బొత్స మాటల ఆంతర్యం ఇదేనా?

By telugu team  |  First Published Feb 15, 2020, 11:38 AM IST

ఎన్డీఎలో చేరే విషయంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అటువంటి ప్రతిపాదన వస్తే జగన్ పరిశీలిస్తారని ఆయన చెప్పారు. చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపే విషయంపై ఆయన సూటిగా మాట్లాడలేదు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ)లో చేరుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన నేపథ్యంలో ఆ ప్రచారం ముమ్మరంగానే సాగింది. ఎన్డీఎలో చేరితే వైసీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బిజెపి సముఖంగా ఉన్నట్లు కూడా ప్రచారం సాగింది.

వైసీపీ కోటాలో మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారని, ఆ తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ కావడమే కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా మద్దతు ప్రకటించారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరికి భిన్నమైన వైఖరిని జగన్ విషయంలో చిరంజీవి అనుసరిస్తున్నారు. 

Latest Videos

undefined

విజయసాయి రెడ్డికి కూడా కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు. మరో మంత్రి పదవి అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు దక్కే అవకాశం లేకపోలేదని వార్తాకథనాలు వచ్చాయి. అయితే, అది అంత నమ్మశక్యంగా లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను బట్టి చూస్తే కొంత నిజం లేకపోలేదని అనిపిస్తోంది. 

బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వైసీపీ ఎన్డీఎలో చేరే అవకాశంపై ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఎలో చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని బొత్స చెప్పారు. 

ఎన్డీఎలో చేరేందుకు వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నారని వచ్చిన వార్తలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. తాము బిజెపికి దగ్గరగా లేము, అలాగని దూరంగానూ లేమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏది మేలు చేస్తుందంటే అది చేయడానికి తమ అధినేత జగన్ సిద్దంగా ఉంటారని బొత్స చెప్పారు. 

వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం ఏ మేరకు చర్చకు వచ్చిందనేది చెప్పలేం. కానీ, బిజెపి మాత్రం వైసీపీని చేర్చుకోవడానికి ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉండవచ్చు. అయితే, జగన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు.

ఇక మరో విషయం, చిరంజీవికి సంబంధించింది. చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపిస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగితే దానికి బొత్స సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీన్ని బట్టి చిరంజీవిని రాజ్యసభకు పంపించే యోచన జగన్ చేస్తున్నారని అనుకోవడానికి వీలు కలుగుతోంది. ఈ విషయం కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

కాగా, ఎన్డీఎలో చేరే విషయాన్ని పరిశీలిస్తామని బొత్స చేసిన వ్యాఖ్యలపై సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. లౌకిక పార్టీగా ఓట్లు పొంది బిజెపిలో ఎలా చేరుతారని ఆయన ప్రశ్నించారు. 

click me!