ఏపీ విపక్ష శిబిరంలో పొత్తు పై అనిశ్చితి నెలకొంది. అసలు టీడీపీ ఎన్డీయేలో చేరుతుందా? లేదా? టీడీపీ, జనసేన దూకుడుతో బీజేపీ హర్ట్ అయిందా? టీడీపీకి బీజేపీ షాక్ ఇస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ అంశంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల ప్రకటన పోటాపోటీగా జరుగుతున్నది. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే సీట్ల పంపకాలపై ఓ అవగాహనకు వచ్చాయి. అభ్యర్థుల ప్రకటన కూడా షురూ అయింది. కానీ, ఈ కూటమిలో బీజేపీ పాత్ర ఏమిటీ అనేదే ఇప్పటికీ తేలని అంశంగా ఉన్నది. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందా? లేదా? అసలు.. టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇస్తుందా? అనే అనుమానాలూ ఉన్నాయి. ఎందుకంటే.. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటన వరకూ టీడీపీ, జనసేనల వ్యవహారం వెళ్లింది. కానీ, బీజేపీ గురించి ప్రకటన లేదు. కమల దళం కూడా ఈ పరిణామం పై స్పందించనేలేదు.
బీజేపీ, జనసేనల సీట్ల పంపకాల సమావేశం తర్వాతే అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఇవి ఇప్పటికీ బలపడుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించి రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే టీడీపీ ఎన్డీయేలో చేరబోతున్నదని చెబుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మార్చి 4వ తేదీన ఢిల్లీకి వస్తున్నట్టు కొన్ని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. మార్చి 5వ తేదీన ఎన్డీయేలో టీడీపీ చేరబోతున్నట్టు ప్రకటిస్తారనే వివరించాయి. మార్చి 12 లేదా 13వ తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నది. కాబట్టి, టీడీపీ ఎన్డీయేలో చేరగానే అభ్యర్థులను వేగంగా ఖరారు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
అంతేకాదు, బీజేపీకి ఏడు లోక్ సభ స్థానాలు, సుమారు ఒక డజన్ అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి టీడీపీ అంగీకరించినట్టు విశ్వసనీయవర్గాలు వివరించాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన మరో ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి.
Also Read: Gruha Jyothi: నేటి నుంచి గృహజ్యోతి.. జీరో కరెంట్ బిల్లుల జారీకి సన్నద్ధత
కాగా, ఇందుకు భిన్నమైన వాదన కూడా వినిపిస్తున్నది. హైదరాబాద్ నగర శివారులో బీజేపీ జాతీయ నాయకుడు శివ ప్రకాశ్ సారథ్యంలో ఓ కీలక సమావేశం జరిగిందని, ఇందులో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పలువురు పాల్గొన్నట్టు తెలిసింది. టీడీపీ, జనసేన తీరుపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారని, పొత్తులపై చర్చలు జరుపుతూనే సీట్లు ప్రకటించడాన్ని తప్పుపట్టినట్టు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఎన్డీయేలో చేరికపైనా చంద్రబాబు నాన్చుతున్నాడని, ఆయన వైఖరిపైనా బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నదని వివరించాయి. ఎన్డీయేలో చేరికపై పార్టీలో చర్చించి మళ్లీ చెబుతామని చంద్రబాబు ముందుకు రాలేదని, ఇంతలోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడినట్టు తెలిపాయి. అందుకే చంద్రబాబు తీరును అనుమానిస్తూ.. పొత్తుపై పునరాలోచించే దిశగా నిర్ణయాలు జరిగినట్టు వివరించాయి. అంతేకాదు, సొంతంగా పోటీ చేయడానికి కూడా బీజేపీ సన్నద్ధం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయం చేసినట్టు పేర్కొన్నాయి.