‘దేశం’లో నంద్యాల ఉపఎన్నిక చిచ్చు?

Published : Jun 27, 2017, 03:45 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
‘దేశం’లో నంద్యాల ఉపఎన్నిక చిచ్చు?

సారాంశం

చంద్రబాబు నంద్యాల పర్యటనతో వ్యతిరేకత మరింత పెరిగిందట. దానికితోడు భూమా వ్యతిరేకులంతా ఏకమవుతున్నారని, వారి చూపంతా వైసీపీ వైపుందన్న సమాచారంతో అభ్యర్ధికి ఇబ్బందులు, అఖిలకు రాజీనామా చేయక తప్పేట్లు లేదని నియోజకవర్గంలోని టిడిపి నేతలే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారట.

నంద్యాల ఉపఎన్నిక తెలుగుదేశంపార్టీలో చిచ్చుపెట్టనుందా? నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. నంద్యాల లో గెలుపు విషయమై చంద్రబాబు చేయించుకున్న  ఏ సర్వేలో కూడా టిడిపికి సానుకూల ఫలితం రాలేదు. సర్వేల తర్వాతే టిడిపి సీనియర్ నేత శిల్పామోహన్ రెడ్డి వైసీపీలోకి జంప్ అయ్యారు. దాంతో టిడిపి బలం పూర్తిగా కుదేలైపోయింది. అందుకే చంద్రబాబు ముందుజాగ్రత్తగా ఏకగ్రీవ జపం మొదలుపెట్టారు. అందుకు మంత్రి అఖిలప్రియనే ప్రయోగించారు. అయితే, ఆ ప్రయోగం కూడా విఫలమైంది.

ఈ నేపధ్యంలోనే నంద్యాలలో టిడిపి అభ్యర్ధి గెలవకపోతే మంత్రిగా రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని అఖిల భీషణ ప్రతిజ్ఞ చేసింది. సమస్య అంతా ఇక్కడే మొదలైంది. ఎప్పుడైతే మంత్రి అంతటి ప్రతిజ్ఞ చేసిందో టిడిపిలోని భూమా ఫ్యామిలీ వ్యతిరేకులంతా ఏకమవున్నారట. ఎలాగైనా అఖిలను ఇంటికి పంపాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. భూమానాగిరెడ్డి బ్రతికున్నంత కాలం టిడిపిలోని ఏ వర్గంతోనూ పడేదికాదు. అదే వైరం ఇపుడు అఖిల కూడా కొనసాగిస్తోందన్నది మంత్రిపై ఉన్న ప్రధాన ఆరోపణ.

జిల్లాలోని మరో సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తితో అఖిలకు సఖ్యత లేదు. పోనీ నంద్యాలలోని నేతలతో అన్నా బాగుంటుందా అంటే అదీ లేదు. నాగిరెడ్డికి బాగా సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డిని దూరంగా పెట్టేసింది. తండ్రి ఎవరితో అయితే సన్నిహితంగా ఉన్నారో వారందరూ మంత్రికి దూరమైపోయారట. అదే సమయంలో మంత్రి వ్యతిరేకులంతా వైసీపీ వైపు చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ కూడా చంద్రబాబుకు సమాచారం ఇచ్చిందట. దాంతో చంద్రబాబులో కలవరం మొదలైంది.

అసలే ప్రభుత్వంపై అన్నీ వర్గాల్లోనూ వ్యతిరేకత కనబడుతోంది. ఇటువంటి సమయంలోనే చంద్రబాబు నంద్యాల పర్యటనతో వ్యతిరేకత మరింత పెరిగిందట. దానికితోడు భూమా వ్యతిరేకులంతా ఏకమవుతున్నారని, వారి చూపంతా వైసీపీ వైపుందన్న సమాచారంతో అభ్యర్ధికి ఇబ్బందులు, అఖిలకు రాజీనామా చేయక తప్పేట్లు లేదని నియోజకవర్గంలోని టిడిపి నేతలే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారట.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్