మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు.. నవ్వుతూనే అధికారులకు వార్నింగ్‌ ఇచ్చిన చంద్రబాబు

By Galam Venkata Rao  |  First Published Jul 1, 2024, 2:00 PM IST

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటే తేదీ ఉదయం 6గంటలకే పింఛను పంపిణీ ప్రారంభమైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని.. తన చేతులమీదుగా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. మాటిచ్చినట్లుగానే తొలి నెల నుంచే పింఛన్లు పెంచి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అధికారులకు మాట వినకపోతే పాత చంద్రబాబును చూస్తారంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పింఛన్లకు రూ.4,408 కోట్లు ఖర్చు చేయడం చరిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ అందించారు. నాయక్ కూతురు ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్, పాములు నాయక్‌కు వృద్ధ్యాప్య పెన్షన్, భార్య సీతా బాయికి రాజధాని పరిధిలో భూమిలేని వారికి ఇచ్చే వ్యవసాయ కూలీ పెన్షన్ అందజేశారు. అనంతరం నాయక్ కుటుంబ సభ్యులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు... వారికి ఇల్లు లేదని తెలుసుకొని స్పందించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వెంటనే అధికారులను ఆదేశించారు. ఎస్టీ వాడలోనే తిరిగి స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మసీదు సెంటరులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు, ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు...
‘‘మీ అందరి దయ, ఆశీస్సులతో 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశా. టీడీపీని ఆదరించిన గ్రామంలో పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మంగళగిరిలో గత ఎన్నికల్లో లోకేశ్‌ ఓటమి చెందారు. అయినా పట్టు వదలకుండా మళ్లీ ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించి మీ అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచారు. గాజువాక, భీమిలి తర్వాత భారీ మెజారిటీ వచ్చిన నియోజకవర్గం మంగళగిరి. మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాపై ఉంది. నేను 10 ఎన్నికలు చూశాను. ఎప్పుడూ చూడని విజయం మాకు దక్కింది. గత ఐదేళ్లలో ఇలా సంతోషంగా కూర్చూని మాట్లాడుకుంది ఒక్కరోజు కూడా లేదు. పోలీసులు ఎప్పుడు గోడ దూకి వస్తారో తెలీదు. భయంకర వాతావరణంలో ప్రజలు, నాయకులు బతికారు. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఐదేళ్లు అణచివేతకు గురయ్యారు. అలాంటి వేల మంది నన్ను కలవడానికి వస్తున్నారు. నాకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ప్రజలకు మాపై చాలా ఆశలు ఉన్నాయి. కానీ అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో అర్థం కావడం లేదు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. ఐదేళ్ల వికృత చేష్టలతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీశారు. గత సీఎం ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లారు. మురుగు కాలువ కూడా కనబడకుండా తెరలు కట్టారు. సమస్యలు దాస్తే దాగవు..’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  

Latest Videos

undefined

ప్రజలకు సేవకులుగానే ఉంటాం...
‘‘ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంచాలని చెపితే.. నాటి ప్రభుత్వం కుదరదని చెప్పింది. పంపిణీ చేయించడం చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని చెప్పాను. వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పి 33 మంది ప్రాణాలు తీశారు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వాలని మేము పోరాడినా వినలేదు. అందుకే ఇప్పుడు సచివాలయ సిబ్బందితో పెన్షన్లు అందిస్తున్నాం. గత పాలకులు నోరిప్పితే అబద్ధాలు చెబుతున్నారు. ఐదేళ్లపాటు అబద్ధాలు చెప్పి బతికారు. నేను, పవన్ ఎన్నికల ముందు జట్టు కట్టడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని.... తర్వాత బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాలు ఆశించాం. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లాం. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ... ఇంతటి ఫలితాలు ఎప్పుడూ రాలేదు. మేము సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండేవాళ్లం కాదు. మీరు మాకు ఇచ్చింది అధికారం కాదు.... బాధ్యత.’ అని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.  

పెన్షన్ ఆద్యులు ఎన్టీఆర్...
‘‘దేశంలోనే మొదటి సారి పెన్షన్‌ను ప్రారంభించింది ఎన్టీఆర్. రూ.35తో ప్రారంభించారు. తర్వాత దాన్ని నేను రూ.75 చేశాను. 2014 వరకు రూ.200 మాత్రమే ఉండేది. అధికారంలోకి రాగానే రూ.1000కి పెంచి, తర్వాత రూ.2000 చేశా. ఇప్పుడు రూ.3వేలు ఉన్నదాన్ని రూ.4 వేలకు పెంచాను. రూ.4 వేల పెన్షన్ లో రూ.2,875ను ఒక్క తెలుగుదేశం పార్టీనే పెంచింది. పేదలకు ఇచ్చే పెన్షన్ లో టీడీపీ హాయంలో పెంచిందే ఎక్కువ అని చెప్పడానికి గర్వపడుతున్నా. పెనుమాకలో 2,595 మంది వివిధ రకాల పెన్షన్ తీసుకుంటున్నారు. వీరికి ఒక నెల పెన్షన్ కు గతంలో రూ.1.06 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నెల పెన్షన్ కు రూ.1.20 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. గుంటూరు జిల్లా మొత్తం 2,61,588 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. వీరికి నెలకు ఇంతక ముందు వరకూ రూ.81 కోట్లు ఖర్చు అవుతుంది.కానీ ఈ నెలలో రూ.111 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 28 వర్గాల వారికి 65.31 లక్షల మందికి పెన్షన్లను అందిస్తున్నాం. పెన్షన్లకు ఇది వరకు నెలకు రూ.1,938 కోట్లు ఖర్చు చేస్తే...ఇప్పుడు దానికి అదనంగా రూ.819 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిల కలిపి రూ.1650 కోట్లు అదనంగా చెల్లించాం. ఈ ఒక్క నెలలోనే పేదలకు పెన్షన్ల కింద ఇస్తున్నది రూ.4,408 కోట్లు. ఇంతకంటే శుభదినం మరొకటి లేదు.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  

పేదలను ఆదుకోవడమే ధ్యేయం...
‘‘బానావత్ రాములు నాయక్ ఇంటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ కింద రూ.4 వేలు అందించా. ఆయన భార్య సీతాబాయికి సీఆర్డీయే పరిధిలో భూమిలేని వారికి అందించే జాబితా కింద రూ.5 వేలు పెన్షన్ అందించాం. ఆయన కూతురు ఐలావత్ సాయిబాయికి వితంతు పెన్షన్ కింద రూ.4 వేలు అందించాం. వీరికి మూడు నెలల బకాయిలతో కలిపి అందించాం. బీదవారైన రాములు నాయక్ కుటుంబం పూరింట్లో ఉంటోంది. కౌలుకు భూమి సాగు చేస్తే రూ.8 లక్షల నష్టపోయారు. వారి పరిస్థితి చూడగానే చాలా బాధేసింది. ప్రభుత్వం తరపున ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాను. ఇలాంటి వారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. పేదలను ఆదుకోవడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ఏడాదికి రూ.33,100 కోట్లు పెన్షన్ లబ్ధిదారులకు ఖర్చు చేయబోతున్నాం. రాబోయే ఐదేళ్లలో రూ.1,65,500 కోట్లు పెన్షన్ల కింద పేదలకు ఖర్చు పెట్టబోతున్నాం. పేదలను ఆదుకునేందుకు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా’’ అని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.  

ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా...
‘‘పరిపాలనలో మేము కష్టపడైనా సరే సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు చేస్తాం. దీని ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకొస్తాం. ఒక హామీ ఇస్తే అమలు చేయాలంటే సుమారు ఐదారు నెలలు పడుతుంది. కానీ ప్రభుత్వం ఏర్పడిన 26 రోజుల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేసి బకాయిలతో సహా అందించాం. దివ్యాంగులకు గత ప్రభుత్వం పెన్షన్ పెంచకుండా రూ.3 వేల వద్దే నిలిపేసింది. అందుకే వారికి ఇప్పుడు రూ.6 వేలకు పెంచాం. పూర్తిగా నడవలేని స్థితిలో ఉండే వారికి రూ.5 వేల నుండి రూ.15 వేలకు పెంచాం. కిడ్నీ, గుండె సమస్య, తలసేమియాతో బాధపడేవారికి రూ.10 వేలు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు అందించామని గొప్పలు చెప్పుకోవడం కాదు..ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలి. జీవన ప్రమాణాలు పెంచడానికి మొదటి అడుగు వేశాం. సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్ఫూర్తితో పేదల జీవితాలు మార్చడంపై శ్రద్ధ పెట్టాం. ఆర్ధిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేస్తాం. ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది...ఎంత అప్పులున్నాయో తెలియడం లేదు. అయినా పేదలను ఆదుకునేందుకు ముందడుగు వేశాం. రూ.4 వేల పెన్షన్ వచ్చే వారికి యేడాదికి రూ.48 వేలు వస్తుంది. రూ.6 వేలు వచ్చే వారికి రూ.72 వేలు వస్తుంది. మీకు ఎకరా మాగాని ఉంటే కౌలు రూ.15 వేలు, మెట్ట భూమికి ఎకరాకు రూ.5 వేలు కౌలు ఉంటుంది. కానీ మూడు ఎకరాల మాగానికి వచ్చే కౌలుకు సమానంగా మన ప్రభుత్వం పెన్షన్ సొమ్మును ఇస్తోంది. 10 ఎకరాల మెట్ట భూమికి వచ్చే కౌలుకు సమానంగా మన ప్రభుత్వం పెన్షన్ సొమ్మును అందిస్తోంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఇంటి మనుషులు చాకిరీ చేయాల్సి ఉంటుంది. ఆదుకోవడానికి ఇబ్బంది పడతారు...అందుకే వారికి రూ.5 వేల నుండి రూ.15 వేలకు పెంచడం మా ప్రభుత్వానికి ఉన్న మానవత్వానిరి నిదర్శనం. ప్రతి కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటా...సంక్షేమంలో ఇది మొదటి అడుగు మాత్రమే.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

సమాజానికి చేయూతనివ్వడంలో ముందుంటా...
‘‘ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయంటే కారణం పట్టిసీమ. పోలవరం పూర్తైతే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. అమరావతిని కూడా గత పాలకులు ఏ గతి పట్టించారో మీకు తెలుసు. అమరావతి పూర్తైతే ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరుకుతంది. తవ్వుతున్న కొద్దీ నాటి ప్రభుత్వ తప్పులు అప్పులు బయటపడుతున్నాయి. వృద్ధులు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత, మత్య్సకార, ఒంటరి మహిళలు, హిజ్రాలు, డప్పుకళాకారులకు పెన్షన్ పెంచాం. విభిన్న ప్రతిభావంతులకు చేయూత ఇవ్వడం సమాజం బాధ్యత...అందులో ముందు నేనుంటా. సమాజానికి చేయూతనివ్వడానికి ముందడుగు వేస్తా. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది. ధరలు తగ్గిస్తే పేద కుటుంబాలకు వెసులుబాటు లభిస్తుంది. ఇంటి సమస్యల వల్ల గతంలో ముసలివాళ్లను భారంగా భావించేవాళ్లు...కానీ ఇప్పుడు నాలుగు రోజులు అదనంగా ఉన్నా పర్వాలేదనుకునే పరిస్థితి వస్తుంది. పెన్షన్ల పంపిణీలో భాగమైన సచివాలయ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేతకాదన్న అడ్మినిస్ట్రేషన్ తోనే నేడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి...
‘‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఒకే రోజు 5 హామీలపై సంతకాలు చేశాను. డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంతకం పెట్టాను. రెండో సంతకం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై పెట్టాను. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి మీకు కాకుండా పోయేది. అందుకే రద్దు చేశాం. మూడవ సంతకం పెన్షన్ల అమలుపై చేశాను. నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై పెట్టాను రూ.5లకే కడుపునిండా అన్నం తినే రోజులు మళ్లీ రాబోతున్నాయి. త్వరలో 183 అన్న క్యాంటీన్లను పెట్టబోతున్నాం..మిగతా చోట్ల కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం. ఐదో సంతకం స్కిల్ సెన్సన్...ఉద్యోగాలు ఉన్నా నైపుణ్యం లేక యువతకు ఉద్యోగాలు రావడం లేదు. నైపుణ్య కేంద్రాలు పెట్టి ఎవరికి ఏ స్కిల్స్ అవసరమో నేర్పిస్తాం. మా ప్రభుత్వానికి మరింత శక్తినిస్తే మరింత సంక్షేమం అందిస్తుంది. మంచి ప్రభుత్వం ఉంటే అందరికీ అండగా ఉండి వెసులుబాటును కల్పిస్తుంది. గత ప్రభుత్వం సరిగా పాలన చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉండేవి కాదు. మాది ప్రజల ప్రభుత్వం...ప్రజా ప్రభుత్వం. నిరంతరం మీ కోసం పని చేస్తాం. నిండు మనసుతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

రాజధాని వస్తుందని విశాఖ వాసులు భయపడ్డారు...
‘‘రాజధాని తరలిపోతుందని గతంలో ఇక్కడివారు బాధపడ్డారు. రాజధాని వస్తుందేమోనని విశాఖవాసులు భయపడ్డారు. వైసీపీ నేతల భూ కబ్జాలు, శాంతిభద్రతల సమస్యలతో భయపడి దుష్టులు దూరంగా ఉండాలని ఉత్తరాంధ్ర వాసులు చిత్తుగా ఓడించారు. అధికారం ఉందని విర్రవీగితే ఏమవుతుందో గత పాలకుడికి పట్టిన గతిని చూస్తే తెలుస్తుంది. మహిళల వ్యక్తిత్వ హననం దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గుంటూరులో రంగనాయకమ్మకు చెందిన శంకర్ విలాస్ లాక్కున్నారు...ఆమె చిన్న షాపు పెట్టుకుంటానన్నా అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో మోసం చేసి వైసీపీ నేతలు లాక్కున్న ఆస్తులన తిరిగి బాధితులకు అప్పగిస్తాం’’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.  

వారివి అడ్డగోలు వాదనలు...
‘‘పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్ ను నాడు జర్మన్ కంపెనీ టెక్నాలజీతో కష్టపడి రెండు సీజన్లలలోనే నిర్మించాం. కానీ గత ప్రభుత్వం రెండేళ్లపాటు పట్టించుకోకపోవడంతో వరదల వల్ల డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. రూ.440 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మిస్తే గత పాలకుల నిర్వాకం వల్ల దెబ్బతింది. కొత్తది మళ్లీ ఇప్పుడు నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని పరిశీలించేందుకు ఇప్పుడు విదేశాల నుండి నిపుణులు వస్తున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.600 కోట్లు మిగిల్చామని గత పాలకులు చెప్పారు..కానీ జరిగిన నష్టం రూ.70 వేల కోట్లు...అది రూ.లక్షల కోట్లకు కూడా పెరుగుతుంది. దుర్మార్గులు గోదావరిలో పోలవరంను ముంచారు..మళ్లీ ఇప్పుడు అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు’’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

నేను చేసిన అభివృద్ధిని తర్వాత పాలకులు కొనసాగించారు...
‘‘ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ నిర్మిస్తే దాన్ని రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. రెండు మూడు ప్రాజెక్టులు తప్ప అన్నింటినీ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. ఏపీలో రాజధాని అమరావతికి రైతులు భూములిచ్చారు..దానికి ప్రతిఫలం కేవలం కౌలు మాత్రమే ఇచ్చాం. అయినా అక్రమాలు జరిగాయని ముద్ర వేశారు. ఇల్లు కట్టుకోవడానికి నేను కూడా స్థలం వెతుక్కుంటుంటే భూ అక్రమాలు చేశానని కేసులు పెట్టారు. పిచ్చోడికి ఎవరిపై కోపం ఉంటుందో తెలీదు. అందుకే విధ్వంసం సృష్టించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన పరపతి ఢిల్లీలో కూడా ఉపయోగపడుతుంది. కులమతాలకు అతీతంగా సమర్థవంతమైన పాలన కావాలని ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఏ రోజైనా బయటకు వచ్చి ప్రజలతో ఒక్కసారైనా మాట్లాడారా..?’’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.  

అత్యాచారాలకు పాల్పడితే అదే చివరిరోజు...
‘‘దళిత కుటుంబానికి చెందిన, గత ప్రభుత్వంలో బాధిత మహిళగా ఉన్న వంగలపూడి అనితను హోంమంత్రిని చేశాం. ఆడబిడ్డల జోలికి ఎవరొచ్చినా...మదంతో ప్రవర్తిస్తే ఎవరినీ వదిలిపెట్టను. ఎవరు అత్యాచారాలకు పాల్పడ్డా అదే చివరి రోజు అవుతుంది. పాలన ప్రారంభమైంది ఈ మధ్యనే కాబట్టి ఇప్పటిదాకా మర్యాదగా చెప్పా. మద్యం, గంజాయి మత్తులో ఏదిపడితే అది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని తెలిస్తే....తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టను.’’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.   

మరోసారి పరదాలు కనబడితే సస్పెండే...
‘‘నేను వెళ్లే దారుల్లో పరదాలు కట్టినట్లు మళ్లీ కనబడితే సస్పెండ్ చేస్తా. అధికారులు కూడా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజుల్లోకి రావాలి. కొత్త శకానికి, కొత్త పాలనకు అందరూ అలవాటు పడాలి. పరదాలు కట్టాలన్న ఆలోచన వస్తే ఇక షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పిన దాని ప్రకారం నడుచుకోకపోతే మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు. తప్పు చేస్తే ఎవర్నీ వదలను. ఎప్పుడూ జరగని అభివృద్ధిని మంగళగిరి నియోజకవర్గంలో చేసి చూపిస్తాం. రోడ్లు వేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాతో చెప్పండి. కోర్టులకు వెళితే పనులు ఆలస్యమవుతాయి. మా ప్రభుత్వం నిరంతరం మీ కోసమే ఆలోచిస్తుంది. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు అమలు చేయడానికి...పేదరికం లేని సమాజానికి పెనుమాక నుండే సంకల్పం తీసుకుంటున్నాం. నేను అందరి వాడిని...ఏ ఒక్కరి వాడిని కాదు. మీ గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించడానికి పనిచేస్తా. కొన ఊపిరి వరకూ ప్రజల కోసమే పోరాడుతా’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు...

click me!