రాష్ట్ర వ్యాప్తంగా పింఛను పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఈ కార్యక్రమాన్నీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ముందుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి పింఛను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని స్పష్టం చేశారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేసింది. ఎన్నికల ముందు చెప్పినట్లే జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీని ప్రారంభించింది. ముఖ్యంమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు పింఛను పంపిణీ చేశారు.
ఎవరికి ఎంత పింఛన్..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేస్తోంది. పింఛను పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పింఛను పెంపును వర్తింపచేశారు సీఎం చంద్రబాబు నాయుడు. పెరిగిన పింఛను రూ.4000, గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి మొత్తంగా రూ.7000 పంపిణీ చేస్తోంది.
కాగా, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ లాంటి వారికి ఇకపై రూ.4000 పింఛను అందనుంది.
దివ్యాంగులకు ప్రతి నెలా ఇచ్చే పింఛనును కూటమి ప్రభుత్వం రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000కు పెంచేసింది. ఇకపై దివ్యాంగులు ప్రతినెలా రూ.6000 పింఛను అందుకుంటారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి గతంలో రూ.5000 పింఛను అందేది... ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం రూ.15,000కు పెంచేసింది. ఇకనుంచి తీవ్ర అనారోగ్య బాధితులు ప్రతినెలా రూ.15వేల పింఛను అందుకుంటారు. ఈ విభాగంలో పింఛను పొందేరు 24,318 మంది ఉన్నారు.
పెరిగిన ఖర్చు..?
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే సీఎం చంద్రబాబు నాయుడు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్ల పింఛను నగదును ఒక్కరోజులో పంపిణీ చేసే దిశగా పనిచేస్తోంది. అయితే, ఇలా పింఛను మొత్తం పెంచడం కారణంగా ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడుతుంది. గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రూ.1,650 కోట్లు అదనపు ఖర్చు అవుతోంది. గత ప్రభుత్వంలో పింఛను కోసం కేవలం నెలకు రూ.1,939 కోట్లు ఖర్చయింది. ఇకపై చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల కోసమే ఏడాదికి రూ.34వేల కోట్లు ఖర్చు చేయనుంది. కాగా, ఈ పింఛన్ల నగదు ఇంటింటికీ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షా 20వేల 97 మంది పాల్గొంటున్నారు.