హైదరాబాద్‌ని అభివృద్ధి చేసినా నాకు ఓటేయలేదు: చంద్రబాబు

By Galam Venkata Rao  |  First Published Jul 1, 2024, 9:01 AM IST

మంగళగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అభివృద్ధి చేసినా ప్రజలు ఓటేయరన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం 6 గంటలకే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి... పింఛను నగదు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పింఛను లబ్ధిదారులు, గ్రామస్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే 26 రోజుల్లోనే పింఛను పెంపు హామీని నిలబెట్టుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. సమాజమే దేవాలయం,  ప్రజలే దేవుళ్లన్న ఎన్‌టీఆర్‌ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే దివ్యాంగుల పింఛను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు. 

Latest Videos

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీకి సంబంధించి జరిగిన విషయాన్ని గుర్తుచేశారు చంద్రబాబు. సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిస్తే గత ప్రభుత్వం, అధికారులు తమ వల్ల కాదని చెప్పారన్నారు. అలా చేయకపోతే ఇంటికెళ్లాలని నాడే చెప్పామని... అలాగే, ప్రస్తుతం లక్షా 25వేల మంది సచివాలయ సిబ్బందితో పింఛను పంపిణీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. ఇలా గత ప్రభుత్వం అన్నీ రివర్స్‌ పనులే చేసిందని చంద్రబాబు విమర్శించారు. రివర్స్‌ పాలన కారణంగా ప్రజల బతుకులు రివర్స్‌ అయ్యాయన్నారు. నారా లోకేశ్‌ను 90 వేలకు పైగా మెజారిటీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గాన్ని గుర్తుపెట్టుకొని రుణం తీర్చుకుంటామని తెలిపారు.

ముఖాముఖిగా పెనుమాక గ్రామస్థులతో మాట్లాడుతున్న క్రమంలో ఓ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రశ్న అడిగారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. పోలవరం చాలా ప్రత్యేకమైన ప్రాజెక్టు అని తెలిపారు. ఇక్కడ నేల ఇసుక పొరలతో కూడి ఉన్నందున నదీ ప్రవాహాన్నిపూర్తిగా మళ్లించి ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. తమ హాయాంలో ప్రత్యేక టెక్నాలజీ డయాఫ్రం వాల్‌, స్పిల్‌ వేల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం.. చిన్నచిన్న పనులు చేపట్టకపోవడంతో ప్రాజెక్టు దెబ్బతిందని వివరించారు. రివర్స్‌ టెండరింగ్‌తో రూ.600 కోట్లు ఆదా చేస్తామని.. రూ.70వేల కోట్లు నష్టం చేశారని మండిపడ్డారు. ఇది టెక్నికల్‌ సబ్జెక్టు అయినా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 

గతంలో తాను హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని వైఎస్‌ కొనసాగించారన్న చంద్రబాబు... జగన్‌ మాత్రం అమరావతిని నిలిపివేశారన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఒకసారి తమ కోసం, మరోసారి రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తికావడం కోసం దేవుడిని ప్రార్థించాలని కోరారు. 

మరో మహిళ మాట్లాడుతూ... హైదరాబాద్‌ మాదిరిగా అమరావతిని కూడా అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. తాను అభివృద్ధి చేసినప్పుడు గుర్తించరని.. ఆ తర్వాత గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ని బాగా అభివృద్ధి చేసినా అక్కడ తనకు ఓటేయలేదని చెప్పారు. అమరావతి విషయంలోనూ ఇదే జరిగిందన్నారు. అయితే, తానెప్పుడూ ఓట్ల గురించి ఆలోచించలేదని, సమాజం ఏం ఇవ్వగలమన్నదే ఆలోచించానన్నారు. అదే సమయంలో గతంలో తనను జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌లో లక్ష మంది తనకు సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు. ప్రభుత్వం అడ్డుపడినా లెక్క పెట్టకుండా ముందుకు వచ్చి తనకు కృతజ్నతలు చెప్పారన్నారు. ఐటీ అన్నం పెడుతుందా అని హైదరాబాద్‌లో డెవలెప్‌ చేసినప్పుడు అనేవారని... దాని ఫలితాలు ఇప్పుడు తెలుస్తాయని వివరించారు. తనను జైల్లో పెట్టినప్పుడు 70, 80 దేశాల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్‌ సంఘీభావం తెలిపారని... రూ.లక్షలు ఖర్చుపెట్టుకొని విదేశాల నుంచి వచ్చి తనకు ఓటేసి వెళ్లారని ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మన పరపతి పెంచేలా ప్రజలు సహకారం అందించారని.. ప్రజల మేలు ఎన్నడూ మర్చిపోలేనని తెలిపారు.

 

click me!