
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తన నిర్ణయాలపై స్పష్టత ఇచ్చారు. కొన్నాళ్లుగా మంత్రి వేణుగోపాల్‌కు, ఆయనకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ నేపథ్యంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ వీడి జనసేనలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన స్పష్టత ఇచ్చారు. తాను వైసీపీని వీడబోవడం లేదని ప్రకటించారు. జనసేన పార్టీలోకి వెళ్లుతున్నాననే వార్తలు వట్టి పుకార్లేనని అన్నారు. వాటిని ఎవరూ నమ్మవొద్దని కోరారు.
రామచంద్రాపురంలో సీఎం పర్సనల్ టీం సర్వే చేసి వాస్తవాలతో నివేదికను సీఎం జగన్‌కు అందిస్తుందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటారని వివరించారు. పాజిటివ్ నిర్ణయమే తీసుకుంటానని సీఎం జగన్ నుంచి హామీ వచ్చిందని వెల్లడించారు.
రామచంద్రపురంలో అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Also Read: పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు వైఎస్ఆర్‌సీపీ బుజ్జగింపులు: ఎంపీతో మిథున్ రెడ్డి భేటీ
కొన్ని సార్లు కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లినప్పుడు వారిని ఓదార్చి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉంటుందని వివరించారు. తాను వైసీపీ వీడుతానని ఎప్పుడూ చెప్పలేదని ఎంపీ పిల్లి చంద్రబోస్ తెలిపారు. పార్టీ నిర్మాణంలో తానూ ఒక పిల్లర్‌నేనని చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మాత్రమే తాను చెప్పానని పేర్కొన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలు కూడా బాధతోనే చెప్పానని, పార్టీపై వ్యతిరేకతతోనో, కోపంతోనే ఏమీ చెప్పలేదని స్పష్టత ఇచ్చారు. ఇందుకు తాను సీఎం జగన్‌కు క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ నిర్మొహమాటంగా తెలియజేసినట్టు వివరించారు.
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి మంగళవారంనాడు విజయవాడలో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు సూర్యప్రకాష్ తో ఆయన చర్చించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్‌సీపీని వీడి జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, సూర్యప్రకాష్ లతో మిథున్ రెడ్డి విజయవాడలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. పార్టీని వీడొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మిథున్ రెడ్డి బుజ్జగించినట్టుగా సమాచారం.