జూన్ లోగా ఉప ఎన్నికలా?

First Published Apr 5, 2017, 8:01 AM IST
Highlights

వారి నియోజకవర్గాల్లో కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్షాల నోళ్ళు మూయించినట్లవుతుందని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అధికారంలో ఉన్నారు కాబట్టి ఉప ఎన్నికల్లో గెలవటం చంద్రబాబుకు పెద్ద కష్టం కూడా కాదు.

జూన్ లోగా ఐదు అసెంబ్లీ స్ధానాలకు ఉపఎన్నికలు జరుగుతాయా? మంత్రివర్గంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న వైసీపీ మంత్రుల నాలుగు స్ధానాలకు, నంద్యాల నియోజకవర్గంతో కలిపి ఉపఎన్నికలు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. జూన్-జూలైలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఒకవేళ ఎన్నిక అవసరమైతే ఎంపిలు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అందుకుగాను దేశం మొత్తం మీద ఖాళీగా ఉన్న ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీ స్ధానాలకు ఉప ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమీషన్ రంగం సిద్ధం చేస్తోంది.

అందులో భాగంగానే నంద్యాల అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక నిర్వహణ తప్పదు. ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి హటాత్ మరణంతో స్ధానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే కదా. అయితే, ఇపుడు ఆ స్ధానంతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నలుగురి నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలకు వెళితే ఎలాగుంటుందని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారట. ఎలాగూ భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, అమరనాధ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసారని స్పీకరే చెప్పారు.

వారి రాజీనామాల కోసం ప్రతిపక్ష్లాలు బాగా ఒత్తిడి పెడుతున్నాయి. కాబట్టి వారి నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్షాల నోళ్ళు మూయించినట్లవుతుందని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అధికారంలో ఉన్నారు కాబట్టి ఉప ఎన్నికల్లో గెలవటం చంద్రబాబుకు పెద్ద కష్టం కూడా కాదు. ఎందుకంటే, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల ఎంఎల్సీ స్ధానాల్లో మొన్ననే గెలిచిన అనుభవం ఉంది కదా? కాబట్టి ఇబ్బంది లేదు. అయితే, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలు గనుక పునరావృతమైతే మాత్రం అధికార పార్టీకి సీన్ సితారే అనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

click me!