
సదావర్తి భూములను వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డికి అంత తేలిగ్గా అప్పజెబుతుందా ప్రభుత్వం? ప్రభుత్వ వైఖరి చూస్తుంటే భూములను ఇవ్వకుండా వ్యవహారాన్ని వీలైనంతగా లాగాలన్నదే ఆలోచనగా కనిపిస్తోంది. తాజాగా భూములపై ఎంఎల్ఏకి వ్యతిరేకంగా రివ్యూ పిటీషన్ వేయాలని ప్రయత్నం చేయటం అదే విషయాన్ని సూచిస్తోంది. భూముల విషయంలో తల బొప్పికట్టింది చంద్రబదబునాయుడుకు. తమిళనాడులోని వందల కోట్ల రూపాయల విలువైన సదావర్తి భూములను రూ. 22 కోట్లకే తన మద్దతుదారులకు సొంతం చేయటం, దాన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీఅందరకీ తెలిసిందే. చివరకు కోర్టు ద్వారా భూములను సొంతం చేసుకునే అవకాశం దక్కింది ఎంఎల్ఏకు.
ఇపుడదే ప్రభుత్వానికి సమస్యగా తయారైంది. సరే, కోర్టు ఆధేశాల ప్రకారం ఎంఎల్ఏ రెండు విడతల్లో రూ. 27 కోట్లు కట్టేసారు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిందేమంటే 84 ఎకరాలను ఆళ్లకు రిజిస్టర్ చేయటమే. కానీ భూములను చేజార్చుకునేందుకు సిద్ధంగా లేదన్న విషయం స్పష్టమైపోతోంది. ఎందుకంటే, సదావర్తి భూముల వ్యవహారంపై సోమవారం కోర్టులో విచారణ జరిగినపుడు ఎంఎల్ఏకు వ్యతిరేకంగా ఓ రివ్యూ పిటీషన్ దాఖలైంది.
ముందుగా రూ. 22 కోట్లకు భూములను సొంతం చేసుకున్న కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్య పిటీషన్ దాఖలు చేసారు. ఎంఎల్ఏకు సదరు భూములను సొంతం చేయటాన్ని అభ్యంతరపెడుతూ ఛైర్మన్ పిటీషన్ దాఖలు చేసారట. అయితే, ఆ పిటీషన్ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. విచారణ దశలోనే పిటీషన్ను కొట్టేసిందట. ఇంతకాలం మౌనంగా ఉండి ఎంఎల్ఏ డబ్బులు మొత్తం కట్టేసిన తర్వాత రివ్యూ పిటీషన్ వేయటంలో అర్ధమేంటి?ఇక్కడే ప్రభుత్వం ఆలోచనేంటో తెలిసిపోతోంది.
ఎట్టి పరిస్ధితిల్లోనూ ఆ భూములను ఎంఎల్ఏకి దక్కకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. అందుకు ఎన్ని మార్గాలుంటాయో అన్నింటినీ వెతుకుతుందనటంలో సందేహం అక్కర్లేదు. మరపుడు ఎంఎల్ఏ చూస్తూ ఊరుకుంటారా? అవసరమైతే సుప్రింకోర్టుకు వెళ్లైనా సరే, భూములను సొంతం చేసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో?