డిఎల్ టిడిపిలో చేరితే  జగన్ కు షాకా?

First Published Oct 2, 2017, 10:44 AM IST
Highlights
  • కొద్ది రోజులుగా కడప జిల్లాలో డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరిక గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
  • డిఎల్ టిడిపిలో చేరితే వైసీపీకి, జగన్ కు పెద్ద ఫాకే అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
  • నిజానికి డిఎల్ ఓ అవుట్ డేటెడ్ లీడరన్న విషయం అందరికీ తెలిసిందే.

కొద్ది రోజులుగా కడప జిల్లాలో డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరిక గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. డిఎల్ టిడిపిలో చేరితే వైసీపీకి, జగన్ కు పెద్ద ఫాకే అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి డిఎల్ ఓ అవుట్ డేటెడ్ లీడరన్న విషయం అందరికీ తెలిసిందే. జిల్లాలో కేవలం మైదుకూరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నేత. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పార్టీ గాలి వీచినపుడు గెలిచారు, లేకపోతే ఓడిపోయేవారు. పార్టీ గాలితో సంబంధం లేకుండా స్వంత బలంతో గెలవటమన్నది డిఎల్ విషయంలో ఎప్పుడూ జరగలేదు.

వైఎస్ ఉన్న రోజుల్లో కొంతకాలం వైఎస్ అనుచరుడిగాను మరి కొంతకాలం వైఎస్ ప్రత్యర్ధులైన నేదురుమల్లి, చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి వర్గీయుడిగానే చెలామణయ్యారు. అంటే మొత్తం మీద ఎవరో ఒకరి అండతోనే దశాబ్దాల పాటు రాజకీయాలు నడిపారన్నది స్పష్టం. చాలా కాలంగా సరైన అండ లేకపోవటంతోనే డిఎల్ జిల్లా రాజకీయాల్లో కనుమరుగైపోయారు. చివరిసారిగా కడప ఎంపికి జరిగిన పోటీలో జగన్ ప్రత్యర్ధిగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి చివరకు డిపాజిట్ కూడా దక్కించుకోని విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి దాదాపు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.

అటువంటి నేతకు ఇపుడు చంద్రబాబునాయుడు జాకీలేసి లేపాలనుకుంటున్నారా? ఒకవేళ డిఎల్ పార్టీలో చేరినా ఏమిటి ఉపయోగమన్న చర్చ టిడిపిలోనే జరుగుతోంది. ఓ నాలుగు నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్ధాయి ఉన్న నేతైతే ఏదోలే అనుకోవచ్చు. కానీ డిఎల్ పరిస్ధితి అది కాదు. తాను గెలవటమే కష్టం. అటువంటిది పార్టీ ఏ విధంగా లాభపడుతుందో తమ్మళ్ళకే అర్ధం కావటం లేదు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు బాగానే తెలుసు. కానీ జిల్లాలో జగన్ ను ఎదుర్కొనేందుకు ఇపుడున్న నేతలు సరిపోరన్నది వాస్తవం. బహుశా అందుకనే జగన్ కు వ్యతిరేకంగా ఎవరొచ్చినా పార్టీలోకి చేర్చుకోవాలని అనుకుంటన్నట్లు కనబడుతోంది. చూడాలి వీళ్ళంతా ఏ మేరకు ప్రభావం చూపుతారో వచ్చే ఎన్నికల్లో?

click me!