భర్త చనిపోవడం ఆ భార్యను కృంగదీసింది. పిల్లలు లేకపోవడం ఆమెను అనాథను చేసింది. అంతే భర్త మరణించిన తరువాత బతకడం ఇష్టం లేక తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గుంటూరులో జరిగింది.
గుంటూరు : గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో ఓ భార్యభర్త చనిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వారిద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు సంతానభాగ్యం లేకపోయినా ఒకరికొకరు తోడుగా ఇన్నేళ్ళు జీవించారు. వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం బారిన పడిన భర్త మృతి చెందితే.. దాన్ని జీర్ణించుకోలేని భార్య కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేని ఆ వృద్ద దంపతులకు ఒకరి తర్వాత మరొకరికి పక్కపక్కనే చితి పేర్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు.
ఈ విషాద ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నావారి తోటకు చెందిన దంపతులు మణుగూరు వెంకటరమణారావు (68), సువర్ణ రంగలక్ష్మి (65)లకు పిల్లలు లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న రమణరావును ఈనెల 19న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది భార్య. అయితే, అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో.. మరుసటిరోజు అర్ధరాత్రి మృతి చెందారు. దీంతో భార్యకు ఏం చేయాలో పాలు పోలేదు. ప్రపంచంలో ఒంటరిగా అయిపోయానన్న భావన ఆమెను చుట్టుముట్టింది. ఇంక తను ఎవరికోసం బతకాలో తెలియలేదు.
దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు.. కనీసం భర్త అంత్యక్రియలకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో తీవ్ర మనస్థాపంతో ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అలా చేయద్దంటూ ఇలాంటి సమయాల్లో సహాయం అందించే రుద్రా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుభానీకి సమాచారం ఇచ్చారు. ట్రస్ట్ సభ్యులు అక్కడికి వచ్చి, ఆమెను ఓదార్చారు. తామే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ధైర్యం చెప్పారు. భర్త చనిపోయిన అద్దె ఇంట్లోకి తాను వెళ్లలేను అంటూ రంగలక్ష్మీ తీవ్రంగా బాధపడ్డారు. పిల్లలు లేరు.. జీవితాంతం తోడుంటానన్న భర్త అనారోగ్యంతో మరణించాడు. ఇక తాను ఎలా బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ట్రస్టు సభ్యలు ఆమెను తామే అనాధాశ్రమం లో చేర్పించి బాగోగులు చూసుకుంటామని నచ్చజెప్పారు. రమణరావు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. తెల్లారాక ఆశ్రమానికి తీసుకు పెడతామంటూ వేకువజామున 3గంటలకు ట్రస్ట్ సభ్యులు రంగలక్ష్మిని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చారు.
అప్పటివరకు ట్రస్టు సభ్యులు చుట్టూ ఉండడంతో కాస్త భరోసాగా ఉన్న ఆమె.. ఆ తరువాత ఒంటరి అయిపోయింది. అందులో రాత్రి పూట.. ఏం చేయాలో తోచలేదు. మళ్లీ భయం చుట్టుముట్టింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఇంటి లోపలికి వెళ్లకుండా తన చీరతో గేటు బయట ఉన్న ఇనప రాడ్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ట్రస్టు సభ్యులు ఆమె మృతదేహానికి శవపరీక్ష చేయించి, భర్త చితి పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు. పిల్లలు లేకపోవడం, భర్త మృతి చెందాడనే మనోవేదనతో బతుకు భారం అవుతుందని భావించి తన సోదరి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని రంగ లక్ష్మి సోదరుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని నగరపాలెం సిఐ హైమారావు తెలిపారు.