అనిల్‌తో విభేదాలు లేవు .... మీడియానే అతి చేస్తోంది : జగన్‌తో భేటీ అనంతరం కాకాణి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 20, 2022, 6:31 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలో పరిణామాలను సీరియస్‌గా తీసుకొన్నారు ఏపీ సీఎం జగన్. దీనిలో భాగంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ .. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి‌లతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. 
 

తనకు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కాకాణి, అనిల్‌లు కలిశారు. భేటీ అనంతరం కాకాణి  మీడియాతో మాట్లాడుతూ.. పోటాపోటీ సభలు పెట్టలేదని ఆయన అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నెల్లూరు రావడంతో సభ పెట్టానని.. కార్యకర్తలతో అనిల్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పారు. 

మీడియా అనవసరంగా ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో లేనప్పుడు అనిల్ కుమార్‌తో కలిసి పనిచేశానని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పార్టీ బాగుండాలని.. తాము చెట్టును నరుక్కునే వ్యక్తులం కాదని మంత్రి పేర్కొన్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తామని  కాకాణి వ్యాఖ్యానించారు. తమ మధ్య విభేదాలు సృష్టించడానికి ఎవరెన్ని కుట్రలు చేసినా .. తమ ఆలోచనలలో మార్పు వుండదని మంత్రి స్పష్టం చేశారు. 

Latest Videos

కాగా... ఏపీ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ తర్వాత కొందరు YCP ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించింది హైకమాండ్. పలువురు అసంతృప్తులను పిలిపించుకొని సీఎం జగన్ మాట్లాడారు. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు.  Nellore జిల్లా నుండి మంత్రివర్గంలోకి Kakani Govardhan Reddy కి జగన్ చోటు కల్పించారు. అయితే గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తనకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ మేరకు సహకరించారో అంతకు రెండింతలు సహకరిస్తానని మాజీ మంత్రి Anil kumar yadavచెప్పారు. అన్నట్టుగానే అనిల్ కుమార్ నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నెల్లూరు జిల్లాకు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చిన రోజునే  మాజీ మంత్రి అనిల్ కుమార్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాదు నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీలను కూడా తొలగించారు. అయితే తన ఫ్లెక్సీలను కూడా నగరంలో ఏర్పాటు చేయని విషయాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వైరి వర్గంగా ఉన్న వారితో కూడా వరుసగా మాజీ మంత్రి అనిల్ కుమార్ సమావేశాలు నిర్వహించడం కూడా కలకలం రేపింది. ఈ పరిణామాలను వైసీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ నెల 17న వైసీపీ ముఖ్య నేతలు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి, మాజీ మంత్రి అనిల్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను దాటొద్దని హెచ్చరించారు.
 

click me!