వైసీపీ శ్రేణులు, వైసీపీ అభిమానులు, సీఎం జగన్ రెడ్డి అభిమానులు, సానుభూతిపరులు వైఎస్ షర్మిలపై కొత్తగా మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అని పేర్కొంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ పేరు ఎందుకు పెడుతున్నారు. దీని ద్వారా వైసీపీ శ్రేణులు ఏం చెప్పదలిచాయి?
MorusupalliSharmila: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలను ఊహించడం సాధారణమే. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రమైన వ్యాఖ్యలు ఉంటాయనీ అందరూ ఊహించారు. వీటికితోడు ఏపీలో కొత్త ట్విస్ట్ వైఎస్ షర్మిల రెడ్డి రూపంలో ఎదురైంది. ఆమె కాంగ్రెస్ ప్రదేశ్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని వైఎస్ జగన్ పై డైరెక్ట్ ఎటాక్ చేయడంతో ఇప్పుడు అన్నా చెల్లెలి మధ్య కామెంట్లే రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ పరిణామాన్ని టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
తెలంగాణ కోడల్ని అంటూ.. వైఎస్సార్టీపీ పెట్టి రాజకీయం చేసిన షర్మిల అనూహ్యంగా ఏపీలో అడుగుపెట్టాల్సి వచ్చింది. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని ఎవరు కొనసాగించాలి? అనే చర్చ మొదలైంది. వైఎస్ జగన్ తన తండ్రి వారసత్వంతోనే నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారనడంలో సందేహం లేదు. ఆస్తులు, ఇతర కారణాలతోపాటు వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కూడా క్లెయిమ్ చేసుకోవడమూ అన్నా చెల్లెలి మధ్య దూరాన్ని పెంచిందనే టాక్ ఉన్నది.
అయితే, ఆమె తెలంగాణకు వెళ్లిన తర్వాత రాజకీయ వారసత్వంపై సమస్య రాలేదు. ఎందుకంటే జగన్, షర్మిల రాజకీయాలు చేసే రాష్ట్రాలు వేరు. కానీ, ఇప్పుడు ఇద్దరూ ఏపీలోనే రాజకీయాలు చేస్తుండటం, ఇద్దరి మధ్య విభేదాలతో దూరంగా ఉండటం, వేర్వేరు పార్టీల్లో ఉండటం వంటివి ఈ సమస్యను జఠిలం చేస్తున్నాయి.
Also Read : YS Sharmila: అన్నా, చెల్లి మధ్య వైరం ఎందుకు మొదలైంది? జగన్‌ను షర్మిల నేరుగా ఢీకొడుతారా?
ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల అన్న జగన్ పై వ్యాఖ్యల్లో వాడిని పెంచింది. దీంతో జగన్ కూడా పరోక్షంగానైనా షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. ఇక వైసీపీ శ్రేణులు ఆమెపై అటాక్ మొదలుపెట్టారు. ‘ఆడపిల్ల’ కదా.. ఆమెకు వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం ఎలా దక్కుతుందని? వారసుడికే ఆ హక్కు ఉంటుందనే కోణంలో వారు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆమె తండ్రి వైఎస్ఆర్ నమ్మిన, చనిపోయే వరకు పని చేసిన పార్టీలో ఉన్నారు. ఇది ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారింది. ఆమె పార్టీలో చేరిన మొదటి రోజే తండ్రి వైఎస్ఆర్‌ను గుర్తు చేశారు. తండ్రి కల(రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం)ను సాకారం చేసే దిశగా కృషి చేస్తానని చెప్పారు.
అయితే, వైఎస్ఆర్ లెగసీని ఆమె కంటిన్యూ చేయరాదని, ముందు ఆ లెగసీ ఆమెకు ఉండదని ఎస్టాబ్లిష్ చేయడానికి వైసీపీ శ్రేణులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఆమెను నేరుగా దాడి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమెను మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అని పిలుస్తున్నారు.
Also Read : Explained: మన బలగాలను మాల్దీవులు ఎందుకు వెనక్కి పంపించాలని అనుకుంటున్నది? చైనా పాత్ర ఏమిటీ?
షర్మిలది లవ్ మ్యారేజీ. భర్త అనిల్ కుమార్. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అనిల్ ఆ తర్వాత క్రైస్తవంలోకి మారారు. పితృస్వామ్య సమాజంలో మహిళ.. ఆమె భర్త ఇంటి పేరును, కులాన్ని వగైరా అన్నింటినీ మోయాల్సి ఉంటుంది. ఈ కోణంలోనే అనిల్ ఇంటి పేరు మొరుసుపల్లిని షర్మిలకు తగిలిస్తూ.. తండ్రి వైఎస్ ఇంటిపేరును పెట్టుకోరాదనే విధంగా టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఆమెను మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అని పేర్కొంటున్నట్టు చర్చ జరుగుతున్నది. అయితే, ఆడపిల్లలు పెళ్లి జరిగిన తర్వాత కూడా అధికారికంగా (డాక్యుమెంట్లు, విద్యార్హతల్లోనూ కొనసాగింపు) తండ్రి ఇంటి పేరును కొనసాగిస్తున్నవారు చాలా మంది ఉన్నారు.