మూడేళ్ళు పూర్తయిన సంతోషమే లేదు

First Published Jun 8, 2017, 1:24 PM IST
Highlights

అధికారం అందుకుని మూడేళ్ళయిందన్న సంతోషం టిడిపికి లేకుండా పోయింది. కారణమేంటంటే ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముట్టటమే. దాంతో సంబరాలకు అవకాశమే లేదు.

నిజానికి తెలుగుదేశంపార్టీ పండుగ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే, సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇదే రోజున చంద్రబాబునాయుడు సిఎం అయ్యారు.  అధికారం అందుకున్న రోజు ఎవరికైనా పండుగలాంటిదే కదా? అయితే, అధికారం అందుకుని మూడేళ్ళయిందన్న సంతోషం టిడిపికి లేకుండా పోయింది. కారణమేంటంటే ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముట్టటమే. దాంతో సంబరాలకు అవకాశం లేకుండాపోయింది.

తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన అద్భుత భవనాలు చిన్న పాటి వర్షానికే కురువటంతో రచ్చ పీక్ స్టేజ్ లో ఉంది. దాంతో అధికార పార్టీ ఆనందం కాస్త ఆవిరైపోయింది. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబు ప్రభుత్వం సాధించిన విజయాలూ లేవు.

పోయిన ఎన్నికల్లో చేసిన హామీలు కూడా అరాకొరానే అమలవుతున్నాయి. చంద్రబాబు చెప్పుకునేందుకు పట్టిసీమప్రాజెక్టు మాత్రమే ఉంది. అయితే, ప్రాజెక్టు మొత్తం అవినీతి మయమంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికితోడు రూ. 450 కోట్ల మేర అవినీతి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ధృవీకరించటంతో ప్రభుత్వానికి ఇబ్బందైంది.

ఇక, పోలవరం గురించైతే చెప్పనే అక్కర్లేదు. ప్రాజెక్టు టిడిపికి ఒక కల్పతరువులాగ మారిపోయింది. అందులోనూ అది చంద్రబాబు మొదలుపెట్టింది కూడా కాదు. కాబట్టి ప్రాజెక్టును తమ ఘనతగా చెప్పుకునే అవకాశం లేదు.

ఎప్పుడో ప్రకటించిన అన్నక్యాంటిన్లయినా ప్రారంభమయ్యాయా అంటే అదీ లేదు. అమలవుతున్న ఇతర సంక్షేమ పథకాల్లో కూడా అవినీతే. పథకాలన్నీ పచ్చ చొక్కాల వాళ్ళ కోసమే అంటూ స్వయంగా భాజపా నేతలే ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని భాజపానే ఆరోపిస్తోంది.

పోనీ తమ్ముళ్ళేమన్నా పద్దతిగా ఉన్నారా అంటే అదీలేదు. పోలీసు, రెవిన్యూ, రవాణాశాఖ ఇలా వివిధ శాఖల ఉన్నతాధికారులపై దాడులు చేస్తున్నారు. అన్నీ స్ధాయిల్లోనూ అవినీతి పెరిగిపోతోందని స్వయంగా టిడిపి నరసరావుపేట ఎంపి రాయపాటిసాంబశివరావే చెప్పారు.

తాజాగా ఓ మంత్రి, ఎంఎల్ఏల భాగస్వామ్యంలో విశాఖపట్నంలో బయటపడిన రూ. 25 వేల కోట్ల భూ కుంభకోణం ప్రభుత్వం, పార్టీని ఓ కుదుపు కుదిపేస్తోంది.  

ఇక, విజయవాడ నవనిర్మాణదీక్ష ప్రారంభంలో జనాలు స్పందించిన తీరు ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దానికితోడు పెరిగిపోతున్న ప్రజావ్యతిరేకత, తమ్ముళ్ళల్లో అసమ్మతి వీటికి అదనం. పక్కలో బల్లెంలా వైసీపీ, చెవిలో జోరీగలా తయారైన భాజపా. మరి ఇన్ని సమస్యల మధ్య మూడేళ్ళ సంబరాలను టిడిపి ఎలా చేసుకోగలుగుతుంది?

 

 

 

 

click me!