
రోజాను మరో ఏడాది ఎలాగైనా సస్పెండ్ చేయాలన్నది అధికారపార్టీ పట్టుదల. కానీ, మరో ఏడాది సస్పెన్షన్ అంటే నిర్ణయాన్నిసమర్ధించుకోవటం ఎలాగ? అదే అర్ధంకాక నిర్ణయాన్ని వాయిదా వేసింది. రోజా వ్యవహారంపై విచారణ జరిపిన కమిటీ మరో ఏడాది సస్పెండ్ చేయాలంటూ నివేదిక ఇచ్చింది. మార్చి మొదటి వారంలోనే నివేదిక అసెంబ్లీకి అందినా నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయింది. నివేదిక అందటమే ఆలస్యం మరో ఏడాది సస్పెన్షనే అన్న రేంజిలో టిడపి మాట్లాడింది. అటువంటిది ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే బడ్జెట్ సమావేశాలు అయిపోవటం ఆశ్చర్యమే.
ఒకటి మాత్రం నిజం. సభలో రోజా ఉండటం చంద్రబాబునాయుడుతో పాటు అధికారపార్టీలో ఎవరికీ ఇష్టం లేదు. కారణం రోజా వాగ్ధాటే. చెప్పదలుకుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పటమే రోజాకున్న బలం. కాబట్టే రోజా అంటే ప్రభుత్వమైనా, టిడిపి అయినా ఉలిక్కిపడుతోంది. సరే, రోజా కూడా ప్రస్తుతానికి వ్యూహాత్మకంగా సభలో కాకుండా మీడియా పాయింట్ వద్దే గొంతు వినిపిస్తోంది. సభలో మాట్లాడకపోయినా రోజా సభకు హాజరవ్వటాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.
మరి రోజా సస్పెన్షన్ పై టిడిపి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది? అందుకు రెండే కారణాలు స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుండి అధికార పార్టీని వైసీపీ ఎడాపెడా వాయించేస్తోంది. దాంతో టిడిపి పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఎదురుదాడి చేయటానికే సభా సమయం మొత్తం సరిపోతోంది టిడిపికి. అదేవిధంగా, ఇప్పటికే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సభలో నుండి సస్పెండ్ చేసారు.
ఏడాది సస్పెన్షన్ తర్వాత మళ్ళీ మరో ఏడాది సస్పెన్షన్ అంటే కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో అధికారపార్టీ ఊహించలేకున్నది. కోర్టు విషయం కన్నా జనాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయం వెన్నాడుతోంది టిడిపిని. మహిళా పార్లమెంట సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రోజాను అరెస్టు చేయటంపై ప్రభుత్వానికి బాగా చెడ్డపేరొచ్చింది. ఈ నేపధ్యంలోనే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ అంటే ఏ విధంగా సమర్ధించుకోవాలో అర్ధంకాకే గింజుకుంటోంది.