ఎందుకు దూరంగా ఉంటున్నారు?

First Published Jun 23, 2017, 7:18 AM IST
Highlights

మేనకోడలుకు పక్కనే ఉండాల్సిన మేనమామ మాత్రం రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్లు కనబడటం లేదు. కారణాలు మాత్రం ఎవరికీ తెలియటం లేదు. ఎస్వీ వ్యవహారశైలిని గురించి బాగా తెలిసిన వారు మూడు కారణాలు ఊహిస్తున్నారు.

కర్నూలు ఎంఎల్ఏ, మంత్రి భూమాఅఖిలప్రియకు స్వయానా మేనమామ అయిన ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైపోయారో అర్ధం కావటం లేదు. నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మృతిచెందినపుడు చంద్రబాబునాయుడు వచ్చారు. మళ్ళీ బుధవారం నంద్యాలలో ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు చంద్రబాబు వచ్చారు. ఈ రెండుసార్లు మాత్రమే ఎస్వీ కనిపించారు. అయితే, మధ్యలో ఏమైపోయారు ఎవరికీ అర్ధం కావటం లేదు.

భూమానాగిరెడ్డి ఉన్నపుడు ఎక్కడ చూసినా ఆయనతోనే కనబడేవారు. అటువంటిది నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలకు వెన్నంటి ఉండాల్సిన బాద్యత కూడా ఎస్వీపైనే ఉంది. పైగా రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా నంద్యాల ఉపఎన్నిక జ్వరం ఊపేస్తున్న విషయం తెలిసిందే కదా? అఖిలలో కూడా ఉపఎన్నికల ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటువంటి సమయంలో మేనకోడలుకు పక్కనే ఉండాల్సిన మేనమామ మాత్రం రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్లు కనబడటం లేదు. కారణాలు మాత్రం ఎవరికీ తెలియటం లేదు. ఎస్వీ వ్యవహారశైలిని గురించి బాగా తెలిసిన వారు మూడు కారణాలు ఊహిస్తున్నారు. భూమా నాగిరెడ్డితో బాగా సన్నిహితంగా మెలిగిన వారిలో చాలామందిని మంత్రి దూరంగా పెట్టేసింది. అందుకు ఏసి సుబ్బారెడ్డి ఉందతమే ఉదాహరణ.

అదే దారిలో ఎస్వీని కూడా అఖిల దూరం పెట్టిందా అన్న అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. లేక అఖిలకు మంత్రిపదవి రావటం ఎస్వీకి ఇష్టం లేక ఆయనే మంత్రికి దూరంగా ఉంటున్నారా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. లేకపోతే టిడిపి నేతలు ఎస్వీని దూరంగా పెట్టేసారా అన్న విషయం కూడా స్పష్టంగా తెలియటం లేదు. కారణాలేవైనా కానీవండి ఎస్వీ వ్యవహారశైలిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

click me!