
జల్లికట్టుకు మద్దుతుగా తెలుగు సీనీ స్టార్లు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు కూడా స్పందించారు. సామాజిక అంశాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించటం మంచిదే. తమిళనాడులో జల్లికట్టును, ఏపిలో కోళ్ళపందేలను న్యాయస్ధానాలు నిషేధించాయి. దాంతో తమిళనాడులో జరుగుతున్న గందరగోళం అందరూ చూస్తున్నదే.
అయితే, తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధించటాన్ని వ్యతిరేకిస్తున్న ఈ స్టార్లు ఏపిలో కోళ్ళపందేల విషయంలో మాత్రం ఎందుకు స్పందించలేదు? నిజానికి పవన్ కానీ మహేష్ గాని చెన్నైలో ఉండటం లేదు. వారి నివాసాలు హైదరాబాద్ లోనే. తెలుగువారై ఉండీ సంప్రదాయ క్రీడ కోళ్ళపందేలపై మాట్లాడకుండా జల్లికట్టుకు మద్దతుగా ట్వీట్లు చేయటాన్ని వారి అభిమానులు జీర్ణించుకోలేకున్నారు.
పైగా ఇద్దరూ కోస్తా జిల్లాలకు చెందిన వారే కావటం గమనార్హం. జల్లికట్టుకు ఎంతటి చారిత్రక నేపధ్యం ఉందో కోళ్ళపందేలకూ అంతే చారిత్రక నేపధ్యముంది. మహేష్ ది పల్నాడు ప్రాంతమైన గుంటూరు జిల్లా. పవన్ సొంతప్రాంతం తూర్పుగోదావరి జిల్లా. గుంటూరు జిల్లాలో పుట్టి పాపులరైన కోళ్ళపందేలు దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాల్లో స్ధిరపడింది. కాబట్టి ఇద్దరూ ముందు కోళ్ళపందేలపైన కూడా స్పందించి ఉంటే బాగుండేది.