
నంద్యాల నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారు. చేరుతున్నారు అనేకంటే టిడిపి వదిలించుకుంది అనటం సబబుగా ఉంటుంది. అటువంటి శిల్పాను జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. శిల్పాను వదిలించుకోవటం ద్వారా చంద్రబాబు పెద్ద భారాన్ని దింపేసుకుంటే, అదే భారాన్ని జగన్ నెత్తికెత్తుకున్నారు.
ఇక్కడ భారమని ఎందుకనాల్సి వచ్చిందంటే, భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు శిల్పా ఆడిన డబుల్ గేమ్ చూసిన తర్వాత ఏ పార్టీకైనా శిల్పా తలనొప్పి క్యాండిడేటే అనక తప్పదు. కేవలం ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకే శిల్పా అనేక డ్రామాలాడారు. ఒకదశలో టిక్కెట్టు కోసం జగన్ ను అడ్డుపెట్టుకుని చంద్రబాబును శిల్పా బ్లాక్ మైల్ కూడా చేసారు.
అంటే టిక్కెట్టు కోసం శిల్పా ఎటువంటి పనికైనా దిగుతారన్న విషయం స్పష్టమైంది. ఇదే విషయమై శిల్పా వైఖరిపై వైసీపీ నేతలు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్ళీ ఏం జరిగిందో ఏమో శిల్పా వైసీపీలో చేరుతున్నారు. శిల్పా పార్టీలో చేరటం వైసీపీ నేతల్లో ఎవరికీ ఇష్టం లేదు. నంద్యాల ఇన్ఛార్జ్ రాజగోపాలరెడ్డి బాహాటంగానే చెప్పారు. టిక్కెట్టు తనకే వస్తుందని, రాకపోతే ఏం చేయాలో అప్పుడే ఆలోచిస్తామని చెప్పటం దేనికి సంకేతం?
ఇటీవలే పార్టీలో చేరిన గంగుల ప్రతాపరెడ్డికి జగన్ ఏం హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు? ఫిరాయింపు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆధిపత్య సమస్యలే నంద్యాలలో జగన్ ఎదుర్కొంటారన్న ప్రచారం మొదలైంది. ఈరోజు పార్టీలో చేరబోతున్నశిల్పా మోహన్ రెడ్డి టిక్కెట్టు హామీతోనే చేరుతున్నారో లేక అభ్యర్ధి ఎవరైనా సరే గెలుపుకు పనిచేయాలనే ఒప్పందంపైనే చేరుతున్నారో ప్రస్తుతానికైతే సస్పెన్సే. శిల్పా వరస చూస్తుంటే ఇంకోరి గెలుపుకోసం పనిచేసే వ్యక్తి కాదు. ఒకవేళ అలా పనిచేసే వ్యక్తే అయితే టిడిపిని వదిలి ప్రతిపక్షంలో చేరుతారా?