చంద్రబాబుకు ఆ సిఎంతో చెడిందా ?

Published : Nov 01, 2017, 03:32 PM ISTUpdated : Mar 24, 2018, 12:04 PM IST
చంద్రబాబుకు ఆ సిఎంతో చెడిందా ?

సారాంశం

ఏపిలో ఇద్దరు సిఎంలకు చెడిందా? టిడిపిలో కానీ ప్రభుత్వంలో కానీ ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది.

ఏపిలో ఇద్దరు సిఎంలకు చెడిందా? టిడిపిలో కానీ ప్రభుత్వంలో కానీ ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇద్దరు సిఎంలు ఎవరా అని ఆలోచిస్తున్నారు. అదేలేండి ఒకరేమో చంద్రబాబునాయుడు, మరొకరేమో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్. వీరిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

చంద్రబాబును అడ్డంపెట్టుకునే సిఎం రమేష్ అంచలంచెలుగా ఎదిగారు. అటువంటి సిఎంకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ పై చంద్రబాబు మూడు రోజులుగా మండిపడుతున్నారు. అదీ బాహాటంగానే. ఇక్కడే అందరికీ పలు అనుమానాలు మొదలయ్యాయి. సిఎం రమేష్ గురించి చంద్రబాబు ఎక్కడా ఒక్కమాట కూడా మాట్లాడరు. అటువంటిది మూడు రోజుల నుండి ఎందుకు బాహాటంగా మండిపడుతున్నారు అన్నదే అర్ధం కావటం లేదు.

ప్రస్తుతానికి వస్తే, గండికోట రిజర్వాయర్ పనులు చేస్తున్నది రిత్విక్ సంస్ధే. అయితే, కాంట్రాక్ట్ తీసుకున్నారే కానీ పనులు మాత్రం అనుకున్నట్లుగా జరగటం లేదు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు పనులూ నత్తకే నడకను నేర్పిస్తున్నాయి. ఇంకోవైపు ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దాంతో చంద్రబాబులో కలవరం మొదలైంది.

ఎందుకంటే, వచ్చే ఎన్నికల నాటికి పోలవరం, గండికోట లాంటి ప్రాజెక్టులను చూపించే మళ్ళీ ఓట్లు సంపాదించాలన్నది చంద్రబాబు వ్యూహం. అటువంటిది రెండు ప్రాజెక్టుల పనులూ దారుణంగా తయారవ్వటంతో ఆందోళన పెరిగిపోతోంది. దానికితోడు ఇటీవలే జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు కూడా రమేష్ తమ్ముడు సిఎం రాజేష్ హాజరుకాలేదు. దాన్ని అవమానంగా భావించిన చంద్రబాబు అప్పటి నుండి సిఎం రమేష్ పై మండిపోతున్నారట.

ఇదంతా చూస్తున్న నేతల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు లేనిదే సిఎం రమేష్ లేరు అన్నట్లుగా ఉంది టిడిపిలో పరిస్ధితి. చంద్రబాబు విదేశీ ప్రయాణాల్లో అత్యధికం రమేష్ కూడా పాల్గన్న విషయం అందరకీ తెలిసిందే. అటువంటిది రమేష్ కు చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఏమైనా మొదలైందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

దానికితోడు కడప జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం కోసం రమేష్ ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఆ నేపధ్యంలో ఇద్దరికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. అవి కూడా చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఇవన్నీ చూస్తుంటే రమేష్ పై చంద్రబాబు ఆగ్రహం నిజమేనా లేక ఉత్తుత్తిదేనా అన్న చర్చ జరుగుతోంది.

 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu