
వైసీపీ నేతలపై దాడులు చేయటానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం టిడిపి నేతలకు లైసెన్సులేమన్నా ఇచ్చిందా? నంద్యాలలో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే అందరికీ అదే అనుమానాలు వస్తున్నాయ్. నంద్యాల ఉపఎన్నిక అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం శిల్పా కుటుంబంపై వ్యవహరిస్తున్న తీరు అనుమానాలను బలపరుస్తోంది.
అభిరుచి మధు వ్యవహారంలో శుక్రవారం రాత్రి శిల్పా చక్రపాణిరెడ్డితో సహా ఎనిమిది మందిపై టూ టౌన్ పోలీస్టేషన్లో కేసు నమొదవ్వటం ఇందుకు నిదర్శనం. ఎన్నికల సందర్భంగా ఒకపార్టీ నేతలు మరో పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారనుకుంటే సరేలే ఏదోలే అనుకోవచ్చు. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అదే పద్దతి నడుస్తుంటే మాత్రం తీవ్ర అభ్యంతరకరమే.
పోలింగ్ ముందే కాకుండా తర్వాత కూడా శిల్పా మోహన్ రెడ్డికి ఎన్నికల్లో పనిచేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వరుసగా దాడులు జరుగుతుండటం ఆక్షేపణీయమే.
పోలింగ్ ముగిసిన తర్వాత టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి తదితరులు పలువురిపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇందులో మహిళలు కూడా ఉండటం గమనార్హం. కక్ష సాధింపులో కూడా రెండు రకాలు. ఒకటి టిడిపి నేతలు వైసీపీ వాళ్ళను గుర్తించి దాడులు చేయటం. దాడులకు గురైన వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదు. రెండోది, టిడిపి వాళ్ళు వైసీపీ నేతలపై చేస్తున్న ఫిర్యాదులకు పోలీసులు వెంటనే కేసులు కట్టేసి యాక్షన్ తీసుకుంటుండటం.
నంద్యాల అభిరుచి మధు విషయంలో జరిగిందదే. తనను చంపేస్తానని మధఉ బెదిరించిన తర్వాత చక్రపాణిరెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు పెట్టలేదు. అదే సమయంలో చక్రపాణి పై మధు చేసిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసారు. అంటే మధు ఏమి చేసినా పోలీసులు పట్టించుకోరా? ఇటీవల పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణరెడ్డి విషయంలో జరిగిందదే కదా? నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేసినా ఎవరిపైనా గట్టి చర్యలు లేవు. అంటే మరో రెండేళ్ళు టిడిపి నేతలు ఏం చేసినా అడిగేవారుండరా?