
నంద్యాలలో ఈరోజు జరిగిన ఘటన జస్ట్ ట్రైలర్ మాత్రమేనా? 28వ తేదీ కౌటింగ్ తర్వాత ఇటువంటి ఘటనలు ఇంకెన్ని చూడాల్సొస్తుందో అని నంద్యాల వాసులు భయంతో వణికిపోతున్నారు. ఉదయం వైసీపీ నేత శిల్సా చక్రపాణిరెడ్డి లక్ష్యంగా టిడిపి నేత, రౌడీ షీటర్ అభిరుచి మధు హత్యాయత్నానికి దిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఓ మైనారిటీ నేత అంత్యక్రియలకు హాజరై చక్రపాణి తిరిగి వస్తున్నపుడు హటాత్తుగా ఘటన జరిగింది. అయితే జరిగిన వ్యవహారం చూస్తుంటే మాత్రం చాలా పెద్ద ప్లాన్ జరిగినట్లే ఉంది.
చక్రపాణిరెడ్డి వెర్షన్ ప్రకారం మధుది అసలు ఆ ఏరియా కానేకాదు. పైగా చనిపోయింది కూడా శిల్పా కు సన్నిహితుడు. కాబట్టి మధుకు సంబంధం ఉండే అవకాశాలు దాదాపు లేవు. అందులోనూ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్నపుడు ఘటన జరిగింది. అంటే ఈ విషయాలన్నింటినీ తెలుసుకునే మధు తన మద్దతుదారులతో చక్రపాణి వచ్చే దారిలో కాపు కాసి ఉండాలి. ఓ వ్యూహం ప్రకారం గొడవకు దిగినట్లే కనబడుతోంది.
దాంతో చక్రపాణి కారు దిగాల్సి వచ్చింది. చక్రపాణి కారు దిగగానే దాడి చేయాలని బహుశా అనుకుని ఉండవచ్చు. అయితే, చక్రపాణితో పాటు పెద్ద ఎత్తున అనుచరులుండటంతో చివరి నిముషంలో వ్యూహం మార్చుకున్నారేమో. అందుకనే ఒక చేత్తో కత్తి పట్టుకుని బెదిరిస్తూ మరో చేతిలో తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపారు. 5 రౌండ్లు కాల్పులు జరపటమంటే మామూలు విషయం కాదు కదా?
సరే, ఇదంతా చూసిన జనాలు భయపడిపోయారు. ఎందుకంటే, టిడిపి అనుకున్నట్లు పోలింగ్ జరగలేదు. భారీగా పోలింగ్ నమోదవ్వటంతో గెలుపవకాశాలు వైసీపీకే ఎక్కువంటూ ప్రచారం ఊపందుకున్నది. దాంతో టిడిపి నేతల్లో ఉక్రోషం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. బుధ, గురువారం తెల్లవారు జామున కూడా వైసీపీ వాళ్ళపై దాడులు జరిగాయి. మధ్యహ్నం చక్రపాణి పైనే హత్యాయత్నం. అంటే, 28వ తేదీ ఫలితం గనుక టిడిపికి వ్యతిరేకంగా వస్తే పరిస్ధితి ఇంకెత భయంకరంగా ఉంటుందనేందుకు ఈరోజు జరిగింది జస్ట్ ఓ ట్రైలర్ మాత్రమేనా అనిపిస్తోంది.