సుజనా, గంటాలపై చర్యలేవి?

First Published May 13, 2017, 10:24 PM IST
Highlights

సుజనా అయినా గంటా అయినా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంటే వాకాటి, సుజనా, గంటా ముగ్గురిదీ ఒకే తరహా కేసు.  చర్యమాత్రం వాకాటిపైనే. ఎందుకంటే, వాకాటిపై సిబిఐ దాడులు చేసిందంతే.

చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం ఇంకా కొనసాగుతున్నట్లే ఉంది. కాకపోతే ఇది బయటవాళ్ళ విషయంలో కాదు. పార్టీలోని సొంత మనుషుల విషయంలోనే. టిడిపి ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సిబిఐ దాడులు జరిగిందన్న కారణంతో చంద్రబాబు వాకాటిని పార్టీ నుండి సస్సెండ్ చేసారు. ఇంతకీ వాకాటి చేసిన నేరమేమిటి? తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలను చెల్లించారా అంటే అదీ లేదు. మూడు జాతీయ బ్యాంకులను మోసం చేసారు. సుమారు రూ. 443 కోట్లు ఎగ్గొట్టారు.

ఎప్పటి నుండో వాకాటిపై ఆరోపణలున్నాయి. ఆరోపణల ఆధారంగా హటాత్తుగా సిబిఐ వాకాటి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేసింది. వాకాటికి ఎంఎల్సీ టిక్కెట్టు ఇచ్చేటప్పటికే ఈ విషయాలు అందరికీ తెలుసు. అయితే, సిబిఐ దాడులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.  సిబిఐ దాడులు చేసిన తర్వాత చంద్రబాబు వాకాటిని పార్టీ నుండి సస్పెండ్ చేసేసారు. ఎందుకంటే,  వైసీపీ నుండి దాడులు మొదలైతే సమాధానం చెప్పుకోవటం కష్టమని.

ఇంత వరకూ బాగానే ఉంది.  మరి అటువంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ల సంగతి ఏమిటి? పై ఇద్దరు సేమ్ టు సేమ్ కేసుల్లోనే ఇరుక్కున్నారు. సుజనాకైతే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది. గంటా ఆస్తులను అటాచ్ చేస్తూ బ్యాంకులు బహిరంగ ప్రకటన కూడా చేసాయి. సుజనా అయినా గంటా అయినా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంటే వాకాటి, సుజనా, గంటా ముగ్గురిదీ ఒకే తరహా కేసు.  చర్యమాత్రం వాకాటిపైనే. ఎందుకంటే, వాకాటిపై సిబిఐ దాడులు చేసిందంతే.

పార్టీ నుండి వాకాటిని సస్సెండ్ చేసిన చంద్రబాబు సుజనాకు మాత్రం రాజ్యసభ రెన్యువల్ ఎందుకు చేసారు? గంటాపై చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారు. గంటాకు వియ్యంకుడు, మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నారాయణ మద్దతుందనా? అంటే పార్టీ నేతల విషయంలోనే చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లే కదా? సుజనా, గంటాను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటే వారిపైన కూడా సిబిఐ దాడులు జరగాలేమో. బాగుంది కదా చంద్రన్న రెండుకళ్ళ సిద్ధాంతం.

 

click me!