
వ్యవసాయ, విద్యుత్ రంగాలపైనే పూర్తి దృష్టి పెట్టారట చంద్రబాబునాయుడు. గతంలో ఎన్ని దేశాలు తిరిగినా రాని సంతృప్తి మొన్నటి అమెరికా పర్యటనలో వచ్చిందట. ఎందుకయ్యా అంటే, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటానికి అవసరమైన ప్లాన్లు వేసారట. అమెరికా పర్యటన గురించి మీడియాతో మాట్లాడుతూ విద్యాత్ ఛార్జీలను తగ్గించటం ద్వారా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్నది తన ఉద్దేశ్యంగా చెప్పారు. అందుకనే విద్యుత్ రంగంలో సౌర, పవన విద్యుత్ విధానాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అమెరికాలోని అయోవా యూనివర్సిటీతో కలిసి విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బహుశా వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ అపప్రదను పోగొట్టుకోవటానికే వ్యవసాయ రంగంపై ప్రధాన దృష్టి పెట్టానని చెప్పుకుంటున్నట్లుంది. సోలార్, పవన విద్యుత్ రంగాల్లో గనుక విద్యుత్ ఉత్పత్తి చేస్తే భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం రాదన్నారు.
భవిష్యత్తులో వాహనాలు కూడా విద్యుత్ ఆధారితంగానే నడుస్తాయని అభిప్రాయపడ్డారు. విద్యుత్ రంగంలో దేశంలోనే రెండోదశ సంస్కరణలకు తానే శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో అనేక అంశాలపై పరిశోధనలు జరుగుతునాయన్నారు. అనేక స్టార్టప్ కంపెనీలు అమెరికాలోనే అధికంగా ఉన్నాయని తెలిపారు.
గుజరాత్ నుండి హోటల్ పరిశ్రమ అభివృద్ధికి, పంజాబ్ నుండి వ్యవసాయ రంగాభివృద్ధికి అమెరికాకు వెళితే ఏపి నుండి ఐటి వృత్తి నిపుణులుగా ఎక్కువమంది వెళ్ళినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. హోలు మొత్తం మీద చంద్రబాబు చెప్పిందేమంటే తన అమెరికా పర్యటన వల్ల సకల జనావళికి మంచి జరుగుతుందని.