
తెల్ల కాగితాలపై సంతకాలు చేయమని అడిగినట్లుంది ఎన్డీఏ వ్యవహారం. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మనసులోని పేరు చెప్పరట. ఎన్దీఏ పరిశీలనలోని పేర్లూ వెల్లడించదట. అయినా సరే ప్రతిపక్షాలన్నీఎన్డీఏ ప్రతిపాదించబోయే అభ్యర్ధికి మద్దతు పలకాలట. విచిత్రంగా లేదూ మోడి వైఖరి. పేరుకు మాత్రమే ప్రతిపక్షాల నుండి మద్దతు అడుగుతున్నారు. నిజంగా ప్రతిపక్షాల నుండి మోడి మద్దతు తీసుకోవాలని అనుకుంటున్నట్లు లేదు. నిజంగా ప్రతిపక్షాల మద్దతు తీసుకోవాలని, రాష్ట్రపతి అభ్యర్ధిని ఏకగ్రీవం చేయాలనుకుంటే తన మనసులోని పేర్లను బయటకు చెప్పేవారే.
రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో అంత గోప్యత ఎందుకో అర్థం కావటం లేదు. పోటీ లేకుండా రాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేయాలని మోడి అనుకుంటే అందుకు అనుసరించాల్సిన విధానమైతే ఇది కాదు. నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి వద్దకు వెళ్ళిన వెంకయ్యనాయడు, రాజ్ నాధ్ సింగ్ మాట్లాడిన మాటలే నిదర్శనం. ఎంతసేపు తమ తరపున పరిశీలనలో ఉన్న అభ్యర్ధుల పేర్లు చెప్పకుండా కాంగ్రెస్ సహకారాన్నే అడిగారు. దాంతో ఎన్డీఏ పరిశీలనలో ఉన్న పేర్లను బయబపెట్టమని సోనియా అడిగితే చల్లగా జారుకున్నారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిని ఏకగ్రీవం చేయాలని ప్రధానమంత్రి ప్రయత్నిస్తే అందుకు యూపిఏ సహకరిచలేదని బట్ట కాల్చి మొహం మీదేయటానికే. అసలు మోడి మనసులో ఎవరి పేరుందో ఎన్డీఏలోని పక్షాలకు ఇంకా చెప్పాలంటే భాజపాకీ తెలీదు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరన్న విషయం కేవలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మోడికి తప్ప ఇంకోరికి తెలీదు. సరే, భాజపా, ఎన్డీఏ పక్షాలు ప్రశ్నించే అవకాశం ఎటూలేదు. యూపిఏ, కాంగ్రెస్ కూడా చెప్పకుండా ఇదేమి ఏకాభిప్రాయ ప్రయత్నాలో మోడికే తెలియాలి?