మాజీ మంత్రి నారాయణ ఇన్నాళ్లు ఎక్కడున్నారు..?: అరెస్ట్‌ వ్యవహారంతో తెరపైకి సరికొత్త చర్చ..!

Published : May 10, 2022, 03:50 PM IST
మాజీ మంత్రి నారాయణ ఇన్నాళ్లు ఎక్కడున్నారు..?: అరెస్ట్‌ వ్యవహారంతో తెరపైకి సరికొత్త చర్చ..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నారాయణ.. 2019లో ఓటమి తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు.   

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. నారాయణ విద్యాసంస్థల అధినేతగా గుర్తింపు తెచ్చున్న నారాయణ.. 2014 ఏపీ ఎన్నికల అనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన నారాయణకు.. రాజధాని అమరాతి నిర్మాణానికి సంబంధించి కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషించారు. మంత్రిగా బిజీగా ఉన్న.. తన నియోజకవర్గం, జిల్లాకు ఆయన సమయం కేటాయించారు. 

అయితే అటు ప్రభుత్వంలో.. ఇటు జిల్లాలో కీలకంగా వ్యవహరించిన నారాయణ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా ఘోర ఓటమి పాలయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారాయణ అప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయాడు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన నారాయణ.. ఓటమి తర్వాత మాత్రం పార్టీ తరఫున సందర్భాలు లేవనే చెప్పాలి. 

ఒక రకంగా చెప్పాలంటే ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే చెప్పాలి. హైదరాబాద్‌లో కూడా బహిరంగ వేదికలపై కనిపించిన సందర్భాలు ఒకటి, రెండు అనే చెప్పాలి. అమరావతి విషయంలో సీఐడీ నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆయన బయటకు వచ్చి స్పందించిన సందర్భాలు లేవు.

అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత.. నారాయణ హైదరాబాద్‌లో కూడా ఎక్కువగా లేరని తెలుస్తోంది. ఆయన నార్త్ ఇండియాకు వెళ్లారని.. అక్కడి నుంచే తన వ్యాపార కార్యకలాపాలు చూసుకున్నారని సమాచారం. నారాయణ విద్యాసంస్థలు తెలుగు  రాష్ట్రాల్లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఎక్కువ సమయం రాజస్తాన్‌లో ఉన్నారని.. అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవారని టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. 

అయితే అమరావతి భూముల విషయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగింది. కానీ అలా జరగలేదు. అయితే తాజాగా ఆయనను టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో అరస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారాయణ అరెస్ట్‌ను టీడీపీ ఖండిస్తుంటే.. ఏపీ మంత్రులు మాత్రం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెబుతున్నారు.

పక్కా వ్యుహాంతోనే అరెస్ట్..!
అయితే నారాయణను పక్కా ప్లాన్‌తోనే అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పేపర్ లీక్‌‌కు నారాయణకు ఏం సంబంధం అని వారు ప్రశ్నిస్తున్నారు. స్కూల్‌లో పనిచేసే వ్యక్తి లీక్ చేస్తే.. దానికి నారాయణను అరెస్ట్ చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నారాయణ కొంతకాలంగా హైదరాబాద్‌లో లేరని.. ఆయన ఇటీవల వచ్చారనే సమాచారంతోనే పోలీసులు అరెస్ట్ చేశారనే ఆరోపణ కొందరు టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. 

మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎలాంటి కక్ష సాధింపు ఆరోపణలను ఖండించింది. పోలీసలు విచారణలో లభించిన సాక్ష్యాల ఆధారంగానే నారాయణను అరెస్ట్ చేశారని.. చట్టం ప్రకారమే వారు ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!