చిరంజీవికి పిసిసి సభ్యత్వం ఎందుకో?

First Published Oct 7, 2017, 8:56 AM IST
Highlights
  • మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పిసిసి సభ్యత్వమా?
  • సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కోలుకునే అవకాశాలు కనిపించటం లేదు.
  • మెల్లిగా కాంగ్రెస్ నేతలందరూ ఇతర పార్టీల్లోకి సర్దుకుంటున్నారు.
  • ఇటువంటి సమయంలో పట్టబట్టి మరీ చిరంజీవి పిసిసి సభ్యత్వాన్ని తీసుకోవటం ఎందుకో ఎవరికీ అర్ధం కావటంలేదు.

మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పిసిసి సభ్యత్వమా? సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కోలుకునే అవకాశాలు కనిపించటం లేదు. మెల్లిగా కాంగ్రెస్ నేతలందరూ ఇతర పార్టీల్లోకి సర్దుకుంటున్నారు. ఇటువంటి సమయంలో పట్టబట్టి మరీ చిరంజీవి పిసిసి సభ్యత్వాన్ని తీసుకోవటం ఎందుకో ఎవరికీ అర్ధం కావటంలేదు. జిల్లాల వారీగా పిసిసి సభ్యులను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో పశ్చిమగోదావరి జిల్లా నుండి చిరంజీవి పేరుండటం విచిత్రంగా ఉంది.

జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ శుక్రవారం  ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్‌–1 పీసీసీ సభ్యురాలిగా కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు. అయితే రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా స్థానం కావాలని కోరుకున్నారు. దాంతో అమరజహా బేగ్‌ తన స్థానాన్ని చిరంజీవి కోసం త్యాగం చేసారు. దాంతో చిరంజీవిని కొవ్వూరు బ్లాక్‌–1 పీసీసీ సభ్యుడిగా నియమించారు.

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ  కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీఉల్లా బేగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడలో  పీసీసీ సభ్యులతో సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. జిల్లా నుంచి సభ్యత్వం కావాలని చిరంజీవి కోరడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఆయన కోసం తన పీసీసీ పదవిని వదులుకున్న అమరజహా బేగ్‌ను ఈ సందర్భంగా అభినందించారు.

అంతా బాగానే ఉందికానీ అసలు చిరంజీవి టిడిపిలో చేరుతారని, రాజకీయాలకే గుడ్ బై చెప్పనున్నారని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో పట్టుబట్టి మరీ పిసిసి సభ్యత్వాన్ని చిరంజీవి తీసుకోవటం వెనుక కారణం ఏమైఉంటుందబ్బా ?

click me!