కీలక సమావేశానికి అశోక్ దూరం: కారణమేంటి?

First Published Feb 4, 2018, 12:25 PM IST
Highlights
  • తెలుగుదేశంపార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్.

తెలుగుదేశంపార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. నాలుగు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపికి కేంద్రం మొండిచెయ్యి చూపిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి కేంద్రప్రభుత్వంపై టిడిపి మండిపడుతోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంపై నిర్ణయం తీసుకునేందుకే  చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆదివారం కీలక సమావేశం జరుగుతోంది. అయితే, ఈ సమావేశంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొనలేదు.

మూడున్నరేళ్ళలో ఇంతటి కీలక  సమావేశం ఎప్పుడూ జరగలేదు. నేతల్లో కొందరేమో భాజపాతో తక్షణమే పొత్తు తెంచుకోవాలని పట్టుబడుతున్నారు.  మరికొందరేమో ప్రస్తుతానికి కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించి ప్రధానమంత్రి నరేంద్రమోడి స్పందన ఏమిటో చూద్దామని చెబుతున్నారు.

పొత్తుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఈరోజు సమావేశం జరుగుతోంది. అంతటి కీలక సమావేశానికి టిడిపి ఎంపి, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు హాజరుకాలేదు. కారణాలు తెలీదు కానీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రులు, కోర్ కమిటి సభ్యులు కూడా హాజరయ్యారు. అటువంటిది అశోక్ గైర్హాజరవ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనారోగ్య సమస్యలేమన్నా ఉన్నాయా? లేకపోతే శాఖకు చెందిన అత్యవసర సమావేశం ఏమన్నా ఉందా అన్న విషయాలపై టిడిపి నేతల్లోనే క్లారిటీ లేదు.

సరే ఆ విషయాన్ని పక్కనుంచితే చాలా కాలంగా చంద్రబాబు-అశోక్ మధ్య సంబంధాలు సరిగా లేవన్న విషయం వాస్తవం. కేంద్రంతో మాట్లాడాల్సిన ఏ విషయానైనా చంద్రాబాబు మరో కేంద్రమంత్రి సుజనా చౌదరికే చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో అశోక్ –చంద్రబాబు మధ్య తేడా కొట్టిందన్నది సమాచారం.

అంతేకాకుండా ప్రధానమంత్రి- అశోక్ మధ్య మంచి సంబంధాలున్నాయ్. ఒకవైపు చంద్రబాబును దూరం పెట్టిన మోడి అశోక్ తో మాత్రం మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. దాంతో చంద్రబాబుకు మండుతోంది. అందులోనూ అశోక్ కు మోడి గాలమేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనే చంద్రబాబుతో అశోక్ చాలాకాలంగా అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఏదేమైనా ఈరోజు కీలక సమావేశానికి అశోక్ హాజరుకాకపోవటంపై పెద్ద చర్చే జరుగుతోంది.   

click me!