ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశీయ జాతుల మొక్కలను నాటాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అన్య జాతుల మొక్కలను నిషేధించాలని కోరారు.
వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోండి. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలి’’ అని పవన్ కళ్యాణ్ కోరారు.
undefined
‘‘మొక్కల జాతుల ఎంపిక కీలకం రాష్ట్రంలో జరిగే వనమహోత్సవం కార్యక్రమంలో నాటబోయే మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. దేశీయ జాతులను ఎంపిక చేసుకోవాలి. స్థానిక వృక్ష జాతులకు చెందిన మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడవచ్చు. పర్యావరణ సమతుల్యత, మానవ ఆరోగ్యాన్ని కాపాడినవాళ్లమవుతాం. మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే, అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వేగంగా పెరుగుతాయని, ఎవెన్యూ ప్లాంటేషన్ అని, నిర్వహణ ఖర్చులు తక్కువ అనే కోణంలో గత దశాబ్ద కాలంగా కోనో కార్పస్, ఏడు ఆకుల పాల, మడగాస్కర్ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి అన్యజాతుల మొక్కలను నాటారు. వీటి వల్ల పర్యవరణానికి మేలు కంటే కూడా కీడు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్య జాతుల మొక్కలు- భూగర్భ జలసంపద మీద ప్రభావం చూపడంతోపాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయి.’’
‘‘అరబ్ దేశాలే కోనో కార్పస్ వద్దనుకున్నాయి అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనోకార్పస్ జాతి మొక్కలను విరివిగా పెంచారు. అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకొని అరబ్ దేశాలే ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయి. దేశంలోనూ తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్ ను నిషేధించాయి. కోనోకార్పస్ వల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయి. భూగర్భ జలసంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కోనోకార్పస్ మొక్కను పశువులు తినవు. పక్షులు గూడుపెట్టుకోవు. చెట్లను ఆశ్రయించే క్రిమికీటకాలు రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచుకోవడం సరికాదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను నాటడం మానేయాలి.’’
‘‘అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు కార్తీకమాసం వనసమారాధన వరకు జరిగే ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా పెంచుదాం. కానుగ, వేప, రావి, చింత, ఉసిరి, శ్రీగంధం, మర్రి, అశోక, రేలా, దిరిసెం మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, సీత అశోక, వెలగ, సీతాఫల వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతులు మొక్కలను పెంచుదాం. పది మందికి నీడనిస్తూ, వాటి ఉత్పత్తులను పంచే మొక్కలను నాటుకుందాం. 29శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతం చేర్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుంది’’ అని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ తెలిపారు. అందరం సమష్టిగా వన మహోత్సవంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.