11మంది రాజ్యసభ ఎంపీలపై చంద్రబాబు ఎందుకు కన్నేశారో..?

By Galam Venkata Rao  |  First Published Aug 29, 2024, 10:36 PM IST

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు మరికొందరు ఎంపీలు వైసీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలపై చర్చ మొదలైంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2019లో ఫుల్‌ జోష్‌తో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ సీట్లలో గతంలో ఎన్నడూ లేనన్నింటినీ తన ఖాతాలో వేసుకున్న జగన్‌ పార్టీ.. 2024కి వచ్చేసరికి చతికిల పడింది. గతంలో 151 అసెంబ్లీ సీట్లు సాధించిన వైసీపీ.. కూటమి దూకుడు ముందు తట్టుకోలేకపోయింది. వై నాట్‌ 175 నుంచి 11 సీట్లకు పడిపోయింది. 

Latest Videos

undefined

ఇదంతా వైసీపీకి ఊహించని షాక్‌ ఇచ్చింది. అయితే, వైసీపీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచిన వాళ్లు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కించుకున్న వాళ్లయినా పార్టీకి అండగా ఉంటారని అంతా భావించారు. కానీ, వాళ్లు కూడా జగన్‌కు అధికారం దూరమైనట్లే.. మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌ రావు తమ పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకంటించేశారు. మరోవైపు, శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత ఎమ్మెలసీ పదవికి రిజైన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వీరంతా వైసీపీ అధిష్టానం తీరు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న పలువురు సీనియర్లు పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. చంద్రబాబు తమ వాళ్లను మభ్యపెట్టి లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ముందుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పాలనా వైఫల్యాల వైపు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని టీడీపీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 'అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారు. కానీ, ప్రజాదరణ పొందలేదు. ఇది చారిత్రిక సత్యం!' ట్విటర్‌లో పోస్టు చేశారు. 

ఎంపీల వ్యవహారంపై మరో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సీనియర్‌ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి కూడా స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రలోభాలు, కొనుగోళ్లు టీడీపీకి కొత్త కాదని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన చంద్రబాబు, ఇలా పార్టీ ఫిరాయింపులతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆక్షేపించారు. ఆయారాం, గయారాంలను తాము పట్టించుకోమన్న కాకాణి.. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టంచేశారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడి చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు ఇసుక రేటు మూడింతలు ఎక్కువగా ఉందని తెలిపారు. 
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం టీడీపీకి అలవాటని, 2014–19 మధ్య తమ పార్టీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఆ విధంగా తమ పార్టీని దెబ్బ తీయాలని చూస్తే.. 2019 ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా అవే సీట్లు దక్కాయని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అవే కొనుగోళ్లు మొదలుపెట్టారన్న ఆయన, ఈసారి ఇన్‌డైరెక్ట్‌ సేల్‌ జరుగుతోందని చెప్పారు. నిజానికి ఇప్పుడు టీడీపీకి అసెంబ్లీ, లోక్‌సభలో మంచి మెజారిటీ ఉన్నా, తమ పార్టీకి చెందిన 11 మంది రాజ్యసభ ఎంపీలపై ఎందుకు కన్నేశారో చెప్పాలని నిలదీశారు.
రాష్ట్రంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ చేస్తున్న ప్రహసనం వల్ల కొరత ఏర్పడి నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి తెలిపారు. పేరుకే ఉచిత ఇసుక అయినా.. సరఫరా అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోందని, వారు యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఇసుక ధర కూడా దారుణంగా పెరిగిందన్న ఆయన, నెల్లూరులో ప్రస్తుత ఇసుక ధరలు ఉదహరించారు. గతంలో ఇసుక ట్రాక్టర్‌ రెండు యూనిట్లు రూ.5 వేలు ఉంటే, ఇప్పుడు మూడు రెట్లు పెరిగి రూ.14 వేల నుంచి రూ.15 వేలకు చేరుకుందని వెల్లడించారు. వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని సమీక్షించి, ధరలు తగ్గించకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని కాకాణి హెచ్చరించారు.

అలాగే, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని కాకాణి ఫైర్‌ అయ్యారు. 'గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే చంద్రబాబు పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా? కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజలను దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారినవారు కాలగర్బంలో కలిసిపోయారు. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదు' అని కాకాణి వ్యాఖ్యానించారు.

click me!