ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తంగా మారాయి. తన ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ కు వైసిపి టికెట్ దక్కకపోవడం టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు తలనొప్పి తెచ్చిపెట్టింది.
విజయవాడ : ఆయన మాజీ మంత్రి... తెలుగుదేశం పార్టీలోని టాప్ లీడర్లలో ఆయనొకరు... అధినేత చంద్రబాబు, లోకేష్ లకు సన్నిహితుడిగా పేరుంది... ఇలా గొప్ప పొలిటికల్ బ్యాగ్రౌండ్ కలిగివున్నా ఆయనకు టికెట్ కష్టాలు తప్పడంలేదు. ఆ టిడిపి నేత మరెవరో కాదు దేవినేని ఉమామహేశ్వరావు. గత ఎన్నికల్లో తనను ఓడించి ప్రత్యర్థి కోసం తన టికెట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉమా ఎదురయ్యేలా కనిపిస్తోంది. మైలవరం నుండి పోటీచేసే అవకాశం మరోసారి ఉమ దక్కకపోవచ్చనే ప్రచారం సాగుతున్నవేళ ఆయనకు టిడిపి అదిష్టానం నుండి పిలుపురావడం ఆసక్తికరంగా మారింది.
ఈసారి కూడా మైలవరం టిడిపి టికెట్ తనదేనన్న ధీమాతో వున్న ఉమకు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు వైసిపి టికెట్ దక్కకపోవడం తలనొప్పి తెచ్చిపెట్టింది. వైసిపిపై తీవ్ర అసంతృప్తితో వున్న వసంత టిడిపిలో చేరేందుకు సిద్దమయ్యారు. సరిగ్గా ఉమ మైలవరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తున్న ఫిబ్రవరి 21నే అంటే రేపు కృష్ణప్రసాద్ టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇలా కృష్ణప్రసాద్ సడన్ ఎంట్రీతో ఉమకే దక్కుతుందనుకున్న మైలవరం టిడిపి టికెట్ పై సస్పెన్స్ నెలకొంది.
దేవినేని ఉమను సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే సహకరించబోమని మైలవరంకు చెందిన కొందరు టిడిపి నాయకులు అదిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో మరో టిడిపి నాయకుడు బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. దీంతో వీరిద్దరికి కాకుండా కొత్తగా పార్టీలో చేరనున్న వసంత కృష్ణప్రసాద్ ను మైలవరం బరిలో దింపేందుకు టిడిపి అదిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read గుడివాడ టికెట్ ఎవరిదో తేలిపోయింది... కొడాలి నాని ముందే హనుమంతరావు క్లారిటీ
ఇప్పటికే మైలవరం అభ్యర్థి విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకే ఇవాళ(మంగళవారం) దేవినేని ఉమను హైదరాబాద్ కు రావాల్సిందిగా అధినేత ఆదేశించినట్లు తెలుస్తోంది. మైలవరం టికెట్ వసంతకు వదిలేసి పెనమలూరు నుండి పోటీ చేయాలని ఉమను చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం. మైలవరంలో తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఉమను చంద్రబాబు ఆదేశించవచ్చని ప్రచారం జరుగుతోంది.