టీడీపీపై కొడాలి నాని దూకుడు: కారణం ఇదేనా?

By narsimha lodeFirst Published Sep 11, 2020, 2:02 PM IST
Highlights

రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఏపీ మంత్రి కొడాలి నాని దూకుడుగా వెళ్తున్నాడు. టీడీపీ ద్వారానే రాజకీయాల్లో ప్రవేశించిన నాని.. అదే టీడీపీని దెబ్బతీసేందుకు తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాడు. 


అమరావతి: రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఏపీ మంత్రి కొడాలి నాని దూకుడుగా వెళ్తున్నాడు. టీడీపీ ద్వారానే రాజకీయాల్లో ప్రవేశించిన నాని.. అదే టీడీపీని దెబ్బతీసేందుకు తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాడు. 

కొడాలి నానికి నందమూరి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణతో నానికి మంచి సంబంధాలు ఉండేవి.  హరికృష్ణ తనయుడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గుడివాడలోని కొడాలి నాని ఇంట్లోనే ఉంటూ ఇంటర్ చదివారు. 

అప్పటి నుండి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నానికి మంచి సంబంధాలున్నాయి. గుడివాడలో రావి కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొడాలి నాని క్రియాశీలంగా ఉన్నారు. రావి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని కాదని కొడాలి నానికి టీడీపీ టిక్కెట్టు కేటాయించడంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉందని చెబుతారు.తన రాజకీయ గురువు హరికృష్ణ అంటూ పలుమార్లు కొడాలి నాని చెప్పారు. 

2009-2014 మధ్య టీడీపీ నాయకత్వంతో కొడాలి నానికి మధ్య అంతరం పెరిగింది. రావి వెంకటేశ్వరరావును టీడీపీలో తిరిగి యాక్టివ్ చేయడానికి పార్టీ నాయకత్వం  రంగం సిద్దం చేసింది. దీనికి తోడు కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలకు మధ్య నానికి కూడ గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వరరావుతో నానికి అంతరం పెరిగినట్టుగా అప్పట్లో టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉండేది. 

అంతకుముందు వరకు దేవినేని ఉమా మహేశ్వరరావుకు, కొడాలి నానికి మధ్య సంబంధాలు బాగానే ఉండేవని చెబుతారు. వీరిద్దరి మధ్య అంతరానికి గుడివాడ రాజకీయాల్లో రావి కుటుంబం తిరిగి రావడంతో పాటు జిల్లాలో చోటు చేసుకొన్న పరిణామాలు కూడ కారణమనే అభిప్రాయాలు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి.

ఈ తరుణంలోనే 2012 చివర్లో రావి వెంకటేశ్వరరావు వద్దకు బాలకృష్ణ వెళ్లారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు. అప్పటికే కొడాలి నాని టీడీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో రావి వెంకటేశ్వరరావును గుడివాడ టీడీపీ ఇంచార్జీగా చంద్రబాబు నియమించారు.

also read:అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యలు:వ్యూహాం ఇదీ...

జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉన్నందునే నానిని టీడీపీకి దూరం చేశారనే వాదనలు కూడ అప్పట్లో సాగాయి. 2014 ఎన్నికల్లో గుడివాడ నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కొడాలి నాని విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కూడ ఆయన మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

గుడివాడలో కొడాలి నాని కంటే ముందు రావి వెంకటేశ్వరరావు కుటుంబం హావా ఉండేది. నాని రాజకీయాల్లో చేరికతో రావి వెంకటేశ్వరావు కుటుంబం ఢీ కొట్టలేకపోయింది. 

తనను దెబ్బకొట్టేందుకు యత్నించిన టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు దేవినేని ఉమా పేర్లు చెబితేనే నాని ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఉంది.
 

click me!