మహిళా మంత్రులేం చేస్తున్నట్లు?

First Published Dec 20, 2017, 6:06 PM IST
Highlights
  • ఏపిలో గడచిన మూడున్నరేళ్ళల్లో మహిళలపై అత్యాచారాలు, ధౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఏపిలో గడచిన మూడున్నరేళ్ళల్లో మహిళలపై అత్యాచారాలు, ధౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళపై ధౌర్జన్యాలు చేసే వాళ్ళని ఉపేక్షించేది లేదని, ప్రతీ మహిళకు తాను అండగా ఉంటానంటూ పోయిన ఎన్నికలపుడు చంద్రబాబునాయుడు ఎన్ని ప్రకటనలు చేసారు, ఎన్ని హామీలిచ్చారో లెక్కే లేదు. కానీ జరుగుతున్నదేంటి? మూడున్నరేళ్ళల్లో మహిళలకు వ్యతిరేకంగా కొన్ని వేల ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్లో మహిళలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం నిజంగా సిగ్గు పడాల్సిన విషయం.

తాజాగా విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఓ ఘటన చంద్రబాబు పాలనకు అద్దం పడుతోంది. జరిగిన, జరుగుతున్న ప్రతీ ఘటన వెనుక తెలుగుదేశంపార్టీ నేతల హస్తమో లేకపోతే మద్దతో ఉంటోందన్న ఆరోపణలకు కొదవేలేదు. మంగళవారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో ఓ ఎస్సీ మహిళను కొందరు వివస్త్రను చేసారు. వారిలో టిడిపి నేతలే స్వయంగా పాల్గొన్నారంటూ సదరు మహిళ నెత్తీ నోరు మొత్తుకుని ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదట.

నారాయణ, శ్రీచైతన్య విద్యసంస్ధల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధినుల గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా, దాదాపు ఏడాది క్రితం రాష్ట్రాన్ని ఓ ఊపుఊపేసిన ‘కాల్ మనీ సెక్స్’ కుంభకోణం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఆ కుంభకోణంలో సూత్రదారులందరూ టిడిపి నేతలే అంటూ ఎన్ని ఆరోపణలు వినిపించయో లెక్కేలేదు. అందులోనూ మంత్రులు, ఎంఎల్ఏల పాత్ర ప్రధానమంటూ వైసిపి కూడా ఆరోపణలు గుప్పించింది. సదరు కుంభకోణం ఎలా వెలుగు చూసిందో అలానే చల్లారిపోయింది.

సరే, క్రైం జరగటం వేరు, బాధ్యులపై చర్యలు తీసుకోవటం వేరు. నేరాలను ఆపలేకపోయినా కనీసం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటే బాధితులకు కాస్తయినా ఊరట లభిస్తుందన్నది వాస్తవం. ప్రత్యేకించి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇన్ని ఘోరాలు జరుగుతుంటే మంత్రివర్గంలో ఉన్న మహిళా మంత్రులు కనీసం నోరు కూడా మెదపటం లేదు. అందుకే వైసిపి ఎంఎల్ఏ రోజా మహిళా మంత్రులకు వ్యతిరేకంగా విమర్శులు, ఆరోపణలు చేస్తున్నారు. తప్పేముంది?

click me!