ప.గో, కృష్ణా జిల్లాల్లో అంతుచిక్కని వ్యాధి... పిట్టల్లా రాలుతున్న చిన్నారులు: నారా లోకేష్ ఆందోళన

By Arun Kumar P  |  First Published Dec 6, 2021, 2:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో అంతుచిక్కని వ్యాధి విజృంభిస్తూ చిన్నారులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. పిల్ల‌ల బాగుకోరేవాడు మేన‌మామ‌...ప్రాణాలు తీసేవాడు కాదని అన్నారు. 


అమరావతి: ఓ పక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతుంటే మరోపక్క సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. ఇలా ఇప్పటికే నలుగురు చనిపోగా వందలమంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమించేవరకు చూడవద్దని... వెంటనే మెరుగైన వైద్యం అందించి చిన్నారులను కాపాడాలని టిడిపి (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) వైసిపి (ysrcp) ప్రభుత్వానికి సూచించారు. 

''అంతుచిక్క‌ని వ్యాధి  (Mysterious Illness)తో పశ్చిమ గోదావరి జిల్లా బోడిగూడెంలో న‌లుగురి మృతి చెందడం బాధాకరం. నెల‌రోజులుగా పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నా ప్ర‌భుత్వం మొద్దునిద్ర పోతోందా? ఈ పిల్ల‌ల మ‌ర‌ణాలు జ‌గ‌న్ స‌ర్కారు హ‌త్య‌లే. పిల్ల‌ల బాగుకోరేవాడు మేన‌మామ‌...ప్రాణాలు తీసేవాడు కాదు'' అంటూ లోకేష్ మండిపడ్డారు. 

Latest Videos

''విష జ్వరాల (virul feaver)తో మరో యాభై మందికి పైగా చిన్నారులు వివిధ ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విష‌మించ‌క‌ముందే... ఇంకొంద‌రు క‌న్న‌వాళ్ల‌కు క‌డుపుకోత మిగ‌ల‌కముందే మేలుకొండి.   వైద్య‌నిపుణుల బృందాల‌ను బోడిగూడెం గ్రామానికి పంపి అంతుచిక్క‌ని జ్వ‌రానికి కార‌ణాలు తెలుసుకొని యుద్ద ప్రాతిప‌దిక‌న నియంత్రణ చర్యలు చేపట్టాలి. చికిత్స పొందుతున్న 50 మందికిపైగా విద్యార్థుల‌కు మెరుగైన వైద్యం అందించాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు.

read more  మచిలీపట్నం గురుకుల పాఠశాలలో ఒకేరోజు 14 మంది చిన్నారులకు అస్వస్థత.. తల్లిదండ్రుల్లో టెన్షన్..

పశ్చిమగోదావరి జిల్లా (west godavari) కొయ్యలగూడెం (koyyalagudem) మండలం బోడిగూడెం (bodigudem) అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. ఎలా వస్తుందో… ఎందుకొస్తుందో తెలియని విష జ్వరాలతో గ్రామం మొత్తం మంచాన పడింది. ఎక్కువగా విద్యార్ధులే బాధితులుగా మారుతున్నారు. ఎక్కువ మంది జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

కరోనా కేసులు దేశంలో క్రమేపీ పెరుగుతుండడంతో కొంతమంది ఇళ్లల్లోనే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. గ్రామాల్లో అనేక చోట్ల పీహెచ్‌సీలకు ప్రతి రోజు వైరల్‌ జ్వరాల చికిత్సకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకున్న పలు మార్పులు కారణంగా విష జ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు, మంచినీళ్లు కలుషితం కావడం, శానిటేషన్ సరిగా లేకపోవడంతోనే పిల్లలు విషజ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. 

read more  ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు, చిత్తూరులో అత్యధికం.. 20,70,835కి చేరిన సంఖ్య

ఇక కృష్ణాజిల్లా (krishna district) మచిలీపట్నం (machilipatnam)లోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) జిల్లా అధికారులతో మాట్లాడి విద్యార్థుల పరిస్థితి గురించి తలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో 14 మంది విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో అస్వస్థతకు గురైనట్టు అధికారులు తెలిపారు. 

విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారులు సమన్వయం తో పని చేయాలని సూచించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థత పై నివేదిక ఇవ్వాలని మంత్రి సూచించారు. వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలని మంత్రి సురేష్ ఆదేశించారు. 
 

click me!