West Godavari Accident: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం జగన్ ప్రకటన

By Arun Kumar PFirst Published Dec 15, 2021, 2:31 PM IST
Highlights

పశ్చిమ గోదావరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు. 

అమరావతి: పశ్చిమ గోదావరి (west godavari bus accident) జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం జగన్‌ (ys jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపిన సీఎం బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఇక ఈ బస్సు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆర్టిసి బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న టిడిపి (TDP) శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదంలో తమవారిని కోల్పోయి బాధలో వున్న కుటుంబాలకు చంద్రబాబు ప్రగాడ సానూభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే అన్నివిదాలుగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. 

read more  పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: తొమ్మిది మంది మృతి

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెంకు దాదాపు 47మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు జల్లేరు వద్ద ప్రమాదానికి గురయ్యింది. జల్లేరు వాగుపై గల వంతెనపై ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు అమాంతం వంతెనపైనుండి వాగులోకి పడిపోయింది.  

వంతెనపై నుండి పడటంతో గాయాలై కొందరు, నీటిలోమునిగి ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు వున్నారు. ఇలా ఇప్పటికే బస్సు డ్రైవర్ సహా తొమ్మిదిమంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

జల్లేరు వాగుపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొని బస్సు వాగులో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులను స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఘటనాస్థలిలో ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

read more  West Godavari Accident: వాగులోకి దూసుకెళ్లిన బస్సు... 9మంది మృతి (వీడియో)  

క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలా చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

బస్సు కింది బాగంలో కూడా ప్రయాణీకులు ఉండి ఉండొచ్చనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను పడవల సహాయంతో ఒడ్డుకు చేర్చిన వెంటనే హాస్పిటల్ కు తరలిస్తున్నారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలిస్తున్నారు. 

click me!