పామును పట్టేందుకు వెళ్లి.. పాముకాటుతో అర్చకుడు మృతి..

By SumaBala BukkaFirst Published Sep 26, 2022, 9:33 AM IST
Highlights

పామును పట్టేందుకు వెళ్లిన ఓ అర్చకుడు అదే పాము కాటుతో మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది.  

కృష్ణాజిల్లా : పామును పట్టుకోడానికి వెళ్లి, అది కాటు వేయడంతో మరణించిన సంఘటన కృష్ణాజిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు శర్మ (48) తండ్రి నుంచి వచ్చిన పౌరోహిత్యాన్ని వారసత్వంగా తీసుకున్నారు.  ఆయన గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.  దసరా సందర్భంగా కృత్తివెన్నుకు వచ్చారు. అతనికి  పాములు  ఎక్కడ కనిపించినా పట్టుకుని నివాసాలకు దూరంగా వదిలి వేయడం అలవాటు ఉంది. కృతివెన్ను పీతలావ గ్రామానికి చెందిన కొందరు రైతులు  శనివారం నాడు నాగబాబు శర్మను  పామును పట్టుకోవడానికి తీసుకువెళ్లారు. .

పట్టుకున్న పామును నివాసాలకు దూరంగా తరలించే సమయంలో అది నాగబాబుశర్మ చేతిపై కాటు వేసింది. దీనికి ఆయన ఇంటి వద్ద ప్రథమ చికిత్స చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  కొంతసేపటికి పరిస్థితి విషమించడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యంకోసం మచిలీపట్నం తీసుకు వెళ్లాలని సూచించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు సొంతకారులో మచిలీపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగానే మరణించారు. 

పాము పగపట్టిందా?!.. ఒకే యువకుడిని, ఒకే చోట 5సార్లు కాటేసిన విషసర్పం...!

ఎంతో మందిని పాముకాటు బారినుండి రక్షించిన ఆయన అదే పాముకాటుతో చనిపోవడానికి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు నాగబాబు శర్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం గుడిదిబ్బలో అంత్యక్రియలు నిర్వహించారు.  ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

ఇదిలా ఉండగా,  కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని పాము కాటు వేసింది. వీరిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే,  ఇలా చనిపోయిన వారంతా పురుషులే కావడంతో.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాముకాటుకు గురవుతున్నారు. గడిచిన 20-25 యేళ్లలో పాము కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతోపాటు హనుమంతప్ప,  వెంకటేష్,  శ్రీనివాస్, ఇటీవల గోవిందరాజు మరణించారు.

ఆగస్ట్ లో ఓ రోజు రాత్రి గోవిందరాజు పొలంలో నీరు పెరుగుతుండగా పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వారంతా దాదాపు ఒకే ప్రదేశంలో పాము కాటుకు గురయ్యారు. ధర్మణ్ణ ఒకరోజు తన పొలం వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టును ఉన్నఫలంగా నరికేశాడు. ఆ చెట్టు శాపమే ప్రస్తుతం ఈ మరణాలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఆ చెట్టు ఆ తర్వాతి కాలంలో మళ్ళీ చిగురించి చెట్టుగా ఎదిగింది. పాము పగ పోవాలని గ్రామస్తులు స్థానిక మునియప్ప ఆలయంలో నిత్య పూజలు చేపట్టారు. 

click me!