ఉద్యోగుల ప్రాణాలు కూడ తమకు ముఖ్యమని అందుకే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
అమరావతి:ఉద్యోగుల ప్రాణాలు కూడ తమకు ముఖ్యమని అందుకే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం నాడు సీఎం జగన్ తో భేటీ ముగిసిన తర్వాత ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ నిర్వహించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై కేంద్రానికి లేఖ రాయనున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తారని చెప్పారు. ఈ లేఖ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ముందుకు వెళ్తామన్నారు.
ఇప్పటికే గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న ఆశా వర్కర్ మరణించిందని ఆయన చెప్పారు.ఈ విషయమై మీడియా ప్రసారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల సమయంలో మద్యం, డబ్బులు పంపిణీ జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామన్నారు. ఒకవేళ మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.
ఉద్యోగుల ప్రాణాలు కూడ తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. అందుకే ఎన్నికలను వాయిదా వేయాలని కోరినట్టుగా ఆయన వివరించారు.